BRS Manifesto: బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల.. కేసీఆర్‌ బీమా కింద కుటుంబానికి రూ.5 లక్షలు.. ప్రతి ఇంటికీ ఇకపై సన్నబియ్యం

రైతు బంధు పథకం దశలవారీగా రూ.16 వేలకు పెంపు. గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్.

BRS Manifesto: బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల.. కేసీఆర్‌ బీమా కింద కుటుంబానికి రూ.5 లక్షలు.. ప్రతి ఇంటికీ ఇకపై సన్నబియ్యం

BRS Manifesto

Updated On : October 15, 2023 / 3:17 PM IST

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం ఏర్పడకముందు అనేక సమస్యలు ఉండేవని చెప్పారు. తెలంగాణ ఏర్పడే నాటికి విద్యుత్తు, నీటి సౌకర్యాలు సరిగ్గా ఉండేవి కాదని అన్నారు. తెలంగాణ పరిస్థితి అనేక విషయాల్లో అగమ్యగోచరంగా ఉండేదని చెప్పారు.

గత ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో చెప్పిన అంశాలను కూడా అమలు చేశామని అన్నారు. దళిత బంధులాంటి పథకం దేశంలో ఎక్కడాలేదని అన్నారు. రైతు బంధు, రైతు బీమా ఇప్పుడు సంపూర్ణ మతసామరస్యం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి సహకరించిన ముస్లిం, క్రిస్టియన్ సోదరులను అభినందిస్తున్నానని చెప్పారు. దళితులకు రూ.10 లక్షలు అందిస్తున్నామని.. దాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

మేనిఫెస్టోలో కేసీఆర్ ప్రకటించిన అంశాలు..

* తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి రైతు బీమా తరహా కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకం.. కుటుంబానికి 5 లక్షల బీమా. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది

* తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి ఇంటికీ ఇకపై సన్నబియ్యం. రేషన్ కార్డు ఉన్న అందరికీ సన్నబియ్యం పంపిణీ

* ఆసరా పెన్షన్లు రూ.3 వేలకు పెంపు

* వచ్చే మార్చి నుంచి వికలాంగుల పెన్షన్ రూ. 5 వేలు. అలాగే, ప్రతి సంవత్సరం వికలాంగుల పెన్షన్ రూ.300 చొప్పున పెంపు

* రైతు బంధు పథకం దశలవారీగా రూ.16 వేలకు పెంపు. రైతు బంధును ముందుగా రూ.12 వేలకు పెంచుతాం

* అర్హులైన పేద మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద నెలకు రూ.3 వేల చొప్పున భృతి

* అర్హులైన వారికి రూ.400కే గ్యాస్ సిలిండర్

* గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్. అక్రిటిడేషన్ ఉన్నవారికి వర్తింపు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు రూ.15 లక్షల వరకు వైద్య సేవలు

* హైదరాబాద్‌ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మరో 2 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం

* అగ్రవర్ణ పేదల కోసం ప్రతి నియోజకవర్గంలో గురుకులాలు. మొత్తం 119 గురుకులాలు

* ఆరోగ్యశ్రీ రూ. 15 లక్షలకు పెంపు

* డిగ్రీ కాలేజీలుగా జూ. కాలేజీలు

* మహిళా స్వశక్తి గ్రూప్‌లకు సొంత భవనాలు

*  అనాథ పిల్లల కోసం పటిష్ఠ పాలసీ

* ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్ కోసం కమిటీ

* మహిళా సంఘాలకు స్వశక్తి భవనాలు

* అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేత.. అన్ని హక్కులు ఇస్తాం

Also Read:

Telangana Congress: మొదటి జాబితాలో టికెట్ దక్కించుకున్నమహిళా అభ్యర్థులు వీరే..