Konda Surekha
Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) దంపతులు భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్‌లు కొండా సురేఖ, మురళిని జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంకు సోమవారం సాయంత్రం తీసుకెళ్లారు. ఆ తరువాత వారు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
ఇటీవల జరిగిన పలు అంశాలపై రేవంత్‌తో వారు చర్చించారు. మంత్రి ఓఎస్డీగా ఉన్న సుమంత్ విషయంపై వీరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు సుమంత్‌కోసం కొండా సురేఖ ఇంటికి వెళ్లడం.. వారిని సురేఖ కుమార్తె సుస్మిత అడ్డుకోవటం.. ఆ తరువాత కొండా సురేఖ సుమంత్‌ను కారులో బయటకు తీసుకెళ్లడం వంటి పరిణామాలతోపాటు.. సుస్మిత వ్యాఖ్యలపైనా రేవంత్ రెడ్డితో భేటీలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అదేవిధంగా మేడారం జాతరకు సంబంధించిన అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో నెలకొన్న విబేధాల విషయంపై రేవంత్ తో కొండా సురేఖ దంపతులు చర్చించినట్లు తెలిసింది.
అసలేం జరిగిందంటే..
మంత్రి కొండా సురేఖ దంపతులు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య మేడారం జాతరకు సంబంధించిన అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో విబేధాలు తలెత్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి తన ప్రమేయం లేకుండానే తనకు సంబంధించిన దేవాదాయ శాఖ పనుల్లో కలుగజేసుకుంటున్నారని కొండా సురేఖ ఆరోపించారు. ఈ క్రమంలో మేడారం అభివృద్ధి పనులపై పరిశీలన, అధికారులతో జరిగిన రివ్యూ సమావేశంలో మంత్రులు పొంగులేటి, సీతక్క పాల్గొన్నప్పటికీ దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ పాల్గొనలేదు. ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం మేడారం జాతరకు సంబంధించిన అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యతలను దేవాదాయ శాఖకు సంబంధం లేకుండా.. కేవలం ఆర్ అండ్ బి శాఖకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు.. మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా ఉన్న సుమంత్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. సుమంత్ డక్కన్ సిమెంట్ యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఆరోపణలపై కొండా సురేఖ ఓఎస్డీగా సుమంత్‌ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తరువాత సుమంత్ కోసం పోలీసులు మంత్రి కొండా సురేఖ ఇంటికి వెళ్లగా.. వారిని సురేఖ కుమార్తె సుస్మిత అడ్డుకున్నారు. ఆ తరువాత కొండా సురేఖ తన కారులో సుమంత్ ను ఎక్కించుకొని ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ పరిణామాల తరువాత సుస్మిత సీఎం రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గంకు చెందిన పలువురు నేతలపై కీలక కామెంట్స్ చేశారు. బీసీలను రెడ్డి సామాజిక వర్గం నేతలు ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె కీలక కామెంట్స్ చేశారు. ఈ పరిణామాలపై ఏఐసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక.. ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు ఈ వ్యవహారంపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొండా దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. పార్టీలో, మంత్రి వర్గంలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులను సీఎం దృష్టికి కొండా సురేఖ తీసుకెళ్లినట్లు తెలిసింది.