KTR: హైదరాబాద్ యూసుఫ్ గూడలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎవరికి లాభం జరిగిందో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లామన్నారు. హైదరాబాద్ లో 42 ఫ్లై ఓవర్లు కట్టామన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లామన్నారు.
తప్పుడు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ లో బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు కేటీఆర్. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూలుస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం కాదు, ఇళ్లు కూలగొట్టే రాజ్యం వచ్చిందన్నారు. పోలింగ్ రోజున ప్రజలు ఆలోచించి ఓటేయాలని సూచించారు. కేసీఆర్ పాలనలో ఎలా ఉండేదో ప్రజలు గుర్తు తెచ్చుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తే.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలవుతాయన్నారు.
ఢిల్లీకి వెళ్తే దొంగలా చూస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు.. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత చిల్లర మాటలు మాట్లాడలేదన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత 500 రోజుల్లో ప్రభుత్వం మారుతుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చే రాజ్యం వచ్చింది, హైడ్రా పేరుతో వేల ఇళ్లు కూలగొట్టారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి మరో మూడేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారో, 3 నెలలే ఉంటారో తెలియదు.. ఆయన సీటుకే గ్యారంటీ లేదు అని కేటీఆర్ విమర్శించారు.
”మరో మూడేళ్లు ఉంది నా ప్రభుత్వం అని సీఎం రేవంత్ అంటున్నారు. మీరు జూబ్లీహిల్స్ లో గట్టిగా దిమ్మతిరిగేలా కొడితే మూడేళ్లు ఉంటాడో, మూడు నెలలే ఉంటాడో.. ఆయన సీటుకే గ్యారంటీ లేదు. మూడేళ్లు అంట.. మూడేళ్లు.. అంత సినిమా లేదు.. ఆల్ రెడీ ఢిల్లీలో కత్తులు నూరుతున్నారు. నల్గొండ, ఖమ్మం కాంగ్రెస్ నాయకులు సీఎం కుర్చీ లాగేందుకు రెడీ అవుతున్నారట. అందుకే, ఆ కుర్చీని మడత పెట్టి.. కారు గుర్తుపై గట్టిగా గుద్దితే అన్నీ సెట్ అవుతాయి. 25 ఏళ్లలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశాం. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ ని చూశాం. ఏ నాడు కూడా వీరు ఒక్క చిల్లర మాట మాట్లాడింది లేదు” అని కేటీఆర్ విరుచుకుపడ్డారు.
”బీఆర్ఎస్ ను బంపర్ మెజారిటీతో గెలిపిస్తే.. నెలకు రెండున్నర వేలు రూపాయలు ఆడబిడ్డలకు ఇయ్యక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వస్తుంది. వృద్ధులకు నెలకు 4వేల పెన్షన్ ఇచ్చే పరిస్థితి కాంగ్రెస్ కు రావాలంటే బీఆర్ఎస్ గెలవాల్సిందే. దివ్యాంగులకు నెలకు 6వేలు రావాలంటే.. బీఆర్ఎస్ గెలవాలి. ఆ భయం కాంగ్రెసోళ్లకి ఉండాలి. లేకపోతే.. నేను ఏమీ ఇవ్వకపోయినా.. రూపాయి సాయం చేయకపోయినా.. ఇళ్లు కూలగొట్టినా, హైదరాబాద్ ను బర్బాద్ చేసినా.. ఒక్క రూపాయి పని చేయకపోయినా, ఒక రోడ్డు వేయకపోయినా నాకే ఓట్లు వేశారు, కాబట్టి నేను ఇంట్లోనే ఉంటాను, ఎవరికీ ఏమీ ఇయ్యను, ఆరు గ్యారెంటీలలో ఒక్కటీ అమలు చేయను అని సీఎం రేవంత్ అంటారా లేదా? ఆలోచించుకోండి” అని ఓటర్లకు పిలుపునిచ్చారు కేటీఆర్.
Also Read: ఫేక్ సర్వేలను నమ్మొద్దు.. జమిలి ఖాయం.. 2034 వరకు మాదే అధికారం