KTR to attend ACB inquiry in Formula E-car race case
E Car Race Scam: ఫార్ములా ఈ-కారు రేసు కేసులో విచారణ నిమిత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇవాళ ఏసీబీ కార్యాలయానికి వెళ్లనున్నారు. విచారణ సమయంలో తన వెంట న్యాయవాదిని తీసుకెళ్లొచ్చని కేటీఆర్ కు హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. విచారణను కనిపించేంత దూరం నుంచి గమనించవచ్చునని.. విచారణ సమయంలో న్యాయవాది కేటీఆర్ కు ఎలాంటి సహకారం అందించరాని, జోక్యం చేసుకోరాదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇవాళ కేటీఆర్ విచారణ నిమిత్తం ఏసీబీ కార్యాలయంకు వెళ్లనున్నారు. అయితే, ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో విచారణ తరువాత కేటీఆర్ ఇంటికి వెళ్తారా.. లేకుంటే.. ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉందా అనే ఆందోళనను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక.. అందులో ఏముందంటే?
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో ఏసీబీ అధికారులు కేటీఆర్ పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఏసీబీ ప్రధాన కార్యాలయంలో జనవరి 6వ తేదీన విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. దీంతో ఈనెల 6వ తేదీ విచారణ నిమిత్తం కేటీఆర్ ఏసీబీ కార్యాలయం వద్దకు తన లాయర్లతో కలిసి వెళ్లారు. కానీ, పోలీసులు కేటీఆర్ వెంట లాయర్ ను అనుమతించక పోవటంతో కొద్దిసేపు అక్కడే వేచిఉండి కేటీఆర్ విచారణకు హాజరు కాకుండానే వెనుదిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తరువాత.. ఏసీబీ విచారణకు తన వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు అనుమతించాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ వేయగా.. పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు.. లాయర్ ను తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
ఫార్ములా ఈ-కారు రేసు కేసులో అరవింద్ కుమార్, దాన కిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది. బిజినెస్ రూల్స్ ఉల్లంఘన, హెచ్ఎండీఏ నిధులు దుర్వినియోగం, క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే అగ్రిమెంట్లు, ఆర్బీఐ అనుమతి లేకుండా చెల్లింపులు.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన తదితర అంశాలపై కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే, ఫార్ములా ఈ-కారు కేసులో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ ఇటీవల హైకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. హైకోర్టు మాత్రం కేటీఆర్ పిటిషన్ ను తిరస్కరించింది. విచారణకు హాజరు కావాల్సిందేనని సూచించింది. దీంతో.. ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారించిన తరువాత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.
కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, పార్టీ ముఖ్యనేతలు ఆయన నివాసానికి చేరుకున్నారు. కోకపేటలోని తన నివాసం నుంచి కేటీఆర్ నివాసానికి హరీశ్ రావు బయలుదేరారు. అయితే, కేటీఆర్ విచారణ సమయంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఏసీబీ కార్యాలయం వద్దకు వచ్చే అవకాశం ఉండటంతో అటువైపు వెళ్లే రహదారులపై పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ ముఖ్యనేతలను కొందరిని పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మరోవైపు ఏసీబీ కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.