Lakkineni Sudheer: వైఎస్సార్టీపీ ఖమ్మం అధ్యక్షుడి పదవికి, పార్టీకి లక్కినేని సుధీర్ రాజీనామా

Lakkineni Sudheer: ఖమ్మం జిల్లా పర్యటనలో షర్మిల ఉన్న సమయంలోనే వైఎస్సార్టీపీ (YSRTP) ఖమ్మం అధ్యక్షుడి పదవికి, పార్టీకి లక్కినేని సుధీర్ రాజీనామా చేయడం గమనార్హం.

Lakkineni Sudheer

Lakkineni Sudheer: వైఎస్సార్టీపీ (YSRTP) ఖమ్మం జిల్లా అధ్యక్షుడి పదవికి, పార్టీకి లక్కినేని సుధీర్ (Lakkineni Sudheer) రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “మా కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్ కుటుంబం.. ఈ నేపథ్యంలోనే నేను మొదట వైఎస్ఆర్సీపీలో చేరాను. అనంతరం వైఎస్సార్టీపీలో పనిచేస్తున్నాను” అని అన్నారు.

“సతీశ్ అనే వ్యక్తి నాకు జిల్లా అధ్యక్షుడి పదవి రాకుండా అడ్డుపడి నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేశాడు. మరోవైపు, షర్మిలమ్మ ఇటీవల జగనన్నను టార్గెట్ చేసి వైఎస్ వివేక కూతురు సునీతకు మద్దతుగా మాట్లాడటం నన్ను బాధించింది. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నాను.

రాజకీయంగా షర్మిలమ్మ పార్టీ బలంగా ఉంది. వైఎస్సార్ విగ్రహాలను పాలేరు నియోజకవర్గంలో తీసివేసినా షర్మిలమ్మ కనీసం స్పందించలేదు” అని లక్కినేని సుధీర్ బాబు చెప్పారు. కాగా, కొన్ని నెలల క్రితం కూడా కూసుమంచి మండలం చింతల తండాలో కొందరు వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇటీవల సునీతకు మద్దతుగా షర్మిల మాట్లాడిన విషయం తెలిసిందే.

వైఎస్ వివేక తన ఆస్తులను సునీత పేరిటే రాశారని, ఆమెపై ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. ఇవాళ షర్మిల ఖమ్మం జిల్లాలోనే పర్యటిస్తున్నారు. కొణిజెర్ల మండలం తుమ్మలపల్లిలో ఆమె ఇవాళ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ సొమ్మసిల్లి పడిపోబోయారు. తర్వాత తేరుకుని మళ్లీ మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా పర్యటనలో షర్మిల ఉన్న సమయంలోనే వైఎస్సార్టీపీ (YSRTP) ఖమ్మం అధ్యక్షుడి పదవికి, పార్టీకి లక్కినేని సుధీర్ రాజీనామా చేయడం గమనార్హం.

YS Sharmila : వైఎస్ వివేకాను కాదు సునీతాను చంపాలి.. వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు