Social Media Posts Case: బండి భగీరథ్ కేసులో హైకోర్టు జడ్జిపై అనుచిత పోస్టులు.. ఒకరి అరెస్ట్
జడ్జిని ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా ఐపీ అడ్రస్ కోసం సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు.
Social Media Posts Case: బండి భగీరథ్ కేసులో హైకోర్టు న్యాయమూర్తి మాధవి దేవిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో విచారణను వేగవంతం చేశారు. జడ్జిపై అనుచిత పోస్టుల కేసులో దామోదర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. భగీరథ్ కు బెయిల్ ఇస్తే న్యాయమూర్తి భర్తకు బార్ అసోసియేషన్ చైర్మన్ పోస్ట్ ఆఫర్ చేసినట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. తన కుటుంబంపై వచ్చిన ఆరోపణలపై న్యాయమూర్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ట్రోల్స్ చేయడం బాధాకరం అన్నారు. దీనిపై ఇప్పటికే హైకోర్టు రిజిస్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హైకోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదుతో చార్మినార్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దర్యాప్తు నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి కేసుని బదిలీ చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు.. జడ్జిని ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా ఐపీ అడ్రస్ కోసం సర్వీస్ ప్రొవైడర్లకు మెయిల్స్ పంపారు.
పోక్సో కేసులో కీలక నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో వాదనల సమయంలో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారు కొందరు వ్యక్తులు. బండి సాయి భగీరథ్ ను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, పోక్సో కేసులో భగీరథకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే న్యాయమూర్తి భర్తను తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్ గా నియమించేలా చూస్తున్నారని కొందరు పోస్టులు పెట్టారు. ఈ కల్పిత పోస్టులు కలకలం రేపాయి. ఏకంగా న్యాయమూర్తిని ఉద్దేశించి ఆరోపణలు చేయడం దుమారం రేపింది. దీన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. మూలాలు కని పెట్టడంపై దృష్టి పెట్టారు. సర్వీస్ ప్రొవైడర్ల నుండి వివరాలు అందిన తర్వాత నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని తెలిపారు. త్వరలోనే మరికొందరిని అదుపులోకి తీసుకోనున్నారు.
Also Read: మొయినాబాద్ జంట హత్యల కేసులో బిగ్ ట్విస్ట్.. అప్పులు ఇచ్చిన 8మందిని చంపేందుకు ప్లాన్
