బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు…భార్గవ్‌ రామ్‌ ఎక్కడున్నాడు..?

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసు…భార్గవ్‌ రామ్‌ ఎక్కడున్నాడు..?

Updated On : January 11, 2021 / 9:28 AM IST

Many suspicions in Boinpally kidnapping case, Where is Bhargav Ram? : తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో మిస్టరీ కంటిన్యూ అవుతునే ఉంది. ఈ కేసులో ఏ3గా ఉన్న అఖిల ప్రియ భర్త భార్గవ రామ్‌ అజ్ఞాతంలోకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు భార్గవ రామ్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకీ భార్గవ్‌ రామ్‌ ఎక్కడున్నాడు.?

సన్సెష‌న‌ల్‌గా మారిన బోయిన్‌ప‌ల్లి కిడ్నాప్ కేసుకు ఇంకా ఫుల్‌స్టాప్‌ పడటం లేదు. రోజులు గడిచే కొద్ది ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ కేసులో అఖిల ప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్‌ రామ్‌ కీలకంగా మారారు. ఇప్పటికే అఖిల ప్రియ అరెస్టై రిమాండ్‌లో ఉండగా…భార్గవ్‌ రామ్‌ మాత్రం ఎక్కడున్నాడన్నది ప్రశ్నార్థకంగా మారింది. అతడి జాడ ఇంకా లభించలేదంటున్నాయి పోలీస్‌ వర్గాలు. కానీ..అఖిల ప్రియ‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ వెంటనే భార్గవ్ రామ్ గురించి దాదాపు పూర్తి సమాచారం సేక‌రించిన‌ట్లు తెలుస్తోంది.

కిడ్నాప్‌ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు…భార్గవ్‌రామ్‌ ను పట్టుకునేందుకు…స్పెషల్‌ టీమ్స్‌ ఏర్పాటు చేశారు. కాల్ డేటా, మొబైల్ లోకేష‌న్‌తో పాటు ఇత‌ర టెక్నిక‌ల్ ఎవిడెన్స్ సేక‌రించి… భార్గవ్ రామ్ బెంగ‌ళూరులో ఉన్నట్లు పోలీసులు గుర్తించార‌నేది విశ్వస‌నీయ స‌మాచారం. బృందాలుగా ఏర్పడిన టాస్క్‌ఫోర్స్…భార్గవ్‌ రామ్‌ కోసం హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరుకు సైతం వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. అంతేకాదు..అక్కడ భార్గవ్ రామ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సరిగ్గా మూడు రోజుల క్రితం అఖిల ప్రియ బెయిల్ పిటీష‌న్ కోర్టులో విచార‌ణ జ‌ర‌గుతుండ‌గా…భార్గవ్ రామ్ లొంగిపోతాడ‌నే ప్రచారం జ‌రిగింది.

ఏ3గా ఉన్న భార్గవ్‌ రామ్‌ కూడా ఇప్పటికే పోలీసుల అదుపులోనే ఉన్నాడని..అయితే పోలీస్‌ వర్గాలు మాత్రం అధికారికంగా వెల్లడించడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. పోలీసులు అతడిని విచారిస్తున్నారని..ఏ క్షణంలోనైనా అతడిని తెరపైకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ అదే నిజమైతే…పోలీసులు ఎందుకు తెరపైకి తీసుకురావడం లేదు.? భార్గవ్‌ రామ్‌ను రహస్యంగా విచారిస్తున్నారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.