Rotten Meat : బిర్యానీ లవర్స్.. ఇది చదవండి.. 14 వేల కేజీల కుళ్లిన మాంసం.. నగరం అంతా సరఫరా.. మళ్లీ అదే షాపులో..
Rotten Meat : నగరంలోని మంగళహట్ ప్రాంతంలో 14 వేల కేజీల కుళ్లిన మాంసం వెలుగులోకి వచ్చింది.
massive rotten meat racket busted in hyderabad mangalhat area officials seize 14 tons meat
- మంగళహాట్ ప్రాంతంలో 14 వేల కేజీల కుళ్లిన మాంసం
- గతంలో ఇదే షాపులో 300 కేజీల కుళ్లిన మాంసం
- కుళ్లిన, చచ్చిన మేక, గొర్రెల మాంసాం నగరం అంతా సరఫరా
Rotten Meat : చికెన్, మటన్ బిర్యానీ అంటే చాలు లొట్టలేసుకుంటూ తింటారు. కొందరికి రోజుకు ఒక్కసారైనా బిర్యానీ తినాల్సిందే. నగరంలో కల్తీ దందా ఏ రేంజ్ లో జరుగుతోందో తెలిపే సంఘటనలు నిత్యం వెలుగు చూసినా సరే.. చాలా మంది బయట ఫుడ్ కే ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి వారికో కీలక అలర్ట్.. తాజాగా హైదరాబాద్ మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏకంగా 14 వేల కేజీల కుళ్లిన మాంసం వెలుగులోకి వచ్చింది. అది ఎంత చండాలంగా ఉందంటే.. తనిఖీకి వెళ్లిన అధికారులు కూడా ఆ దుర్వాసన భరించలేక.. మాస్కులు పెట్టుకుని.. నానా తంటాలు పడ్డారు. మంగళహాట్ పరిధిలో ఉన్న ఓ మాంసం వ్యాపారి గోదాంలో 14 వేల కిలోల కుళ్లిన మాంసాన్ని పట్టుకున్నారు అధికారులు.
బుధవారం హెల్త్ ఫాస్ట్ టీమ్, జీహెచ్ఎంసీ అధికారులతో పాటు మంగళహాట్ పోలీసులు, గోల్కొండ టాస్క్‌ఫోర్స్ అధికారులు ఆ ప్రాంతంలో తనిఖీలకు వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి వారికి తల తిరిగిపోయింది. ఎటు చూసినా.. ఏం పట్టుకున్నా కుళ్లిన మాంసం, మటన్ ముద్దలు కనిపించి షాక్‌కు గురయ్యారు. అక్కడున్న సంచులు, డబ్బాలను తెరిచి చూస్తూ పోగా.. సుమారు 14 వేల కిలోలుగా తేలింది. ఇక్కడ మరింత ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే.. మార్చి 12న ఇదే వ్యాపారి గోదాంలో 300 కేజీల కుళ్లిన మాంసాన్ని పట్టుకున్నారు. అప్పుడు అరెస్ట్ చేసి జరిమానా విధించారు. అతగాడు మాత్రం తన తీరు మార్చుకోలేదు. దీంతో నగరంలో కల్తీ దందా చేసే వారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
సదరు వ్యాపారి పేరు మహమ్మద్ అఫ్రోజ్. అతడు ఆర్ కే పేట్ చిస్తీ చమాన్ ప్రాంతంలో ‘ఏ టూ జెడ్ షీప్ అండ్ గోట్స్ ఆఫల్స్’ పేరుతో గొర్రె, మేక మాంసం అమ్ముతుంటాడు. ఇందుకోసం జమ్మూ కశ్మీర్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో చచ్చిన, కుళ్లిన మాంసాన్ని తక్కువ ధరకు తీసుకువస్తాడు. దీనితో పాటు నగరంలోని కబేళాల్లో చనిపోయిన మేకలు, గొర్రెల మాంసాన్ని కూడా తీసుకువస్తాడు. ఈ మాంసాన్ని.. ఇక్కడ కోల్డ్ స్టోరేజీ గోదాం ఏర్పాటు చేసి.. డీప్ ఫ్రీజర్లు, కెమికల్స్ కలిపిన నీటిని నింపిన డ్రమ్ములు, ప్లాస్టిక్ టబ్బులు, సంచుల్లో నిల్వ చేసి.. దుర్వాసన రాకుండా కెమికల్స్ కలిపేవాడు. తన షాపుకు వచ్చే వారికి తాజా మాంసం అంటూ హోల్‌సేల్‌గా అమ్మేవాడు. పైగా ఇదే మాంసాన్ని.. నగరంలోని పలు మటన్ షాపులు, ప్రధాన హోటళ్లు, రెస్టారెంట్లు, ఆఖరికి పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కూడా సరఫరా చేసేవాడు. కిలో రూ.500 కన్నా తక్కువ ధరకే అమ్ముతుండటంతో.. జనాలు ఎగబడి కొంటున్నారు. మాంసంతో పాటు కాళ్లు, తలకాయలు కూడా తక్కువ ధరకే అమ్ముతున్నాడు.
అధికారులు తనిఖీకి వచ్చిన సమయంలో ఈ మాంసం షాపు ఓనర్ మహమ్మద్ అఫ్రోజ్ అక్కడి నుంచి పరారయ్యాడు. షాపులో పనిచేసే ఓ వ్యక్తి మాత్రం “శాంపిల్స్ తీసుకెళ్లండి.. కావాలంటే జరిమానా వేసుకోండి” అంటూ దురుసుగా మాట్లాడాడు. ఈ వార్త చదివాక బయట తినాలంటేనే భయం వేస్తోంది అంటున్నారు జనాలు.
