Medaram Jathara: మేడారం సమ్మక్క-సారక్క జాతర.. హుండీ లెక్కింపు ప్రారంభం

తెలంగాణాకే తలమానికమైన మేడారం సమ్మక్క-సార్క జాతర ఈ ఏడాది వైభవోపేతంగా జరిగింది.

Medaram Hundi

Medaram Jathara: తెలంగాణాకే తలమానికమైన మేడారం సమ్మక్క-సార్క జాతర ఈ ఏడాది వైభవోపేతంగా జరిగింది. సమ్మక్క-సారక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతర కన్నుల పండువగా సాగింది. మేడారం జాతర హుండీల లెక్కింపును షురూ చేశారు అధికారులు.

హన్మకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను తెరిచి పోలీస్‌ సిబ్బంది ఆధ్వర్యంలో ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం 497 హుండీల్లో ఇప్పటివరకు 65 హుండీలను తెరిచారు. వీటిలో కోటి 34 లక్షల 60 వేల రూపాయల ఆదాయం వచ్చింది. వాటిని అధికారులు బ్యాంకులో జమ చేశారు.

లెక్కింపునకు రెండు వారాల సమయం పడుతుందంటున్నారు దేవాదాయ శాఖ అధికారులు. పలు దేవాలయాల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సభ్యులు లెక్కింపులో పాల్గొంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లెక్కింపు ఉంటుందని.. గత జాతరకు సుమారు 11 కోట్ల రూపాయలు కానుకల రూపంలో వచ్చాయని.. ఈసారి ఇంకా ఎక్కువ వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అధికారులు.