Medico Preethi Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో ఆమె సోదరుడు వంశీ సంచలన విషయాలు బయటపెట్టాడు. నిమ్స్ లో ప్రీతి పొత్తి కడుపు వద్ద సర్జరీ చేశారని, ఆ సర్జరీ ఎందుకు చేశారో ఎవరికీ తెలియడం లేదన్నారు. ప్రీతికి చేతిపై గాయం
ఉందన్నారు వంశీ.
ప్రీతికి పూర్తిగా శరీరంలో బ్లడ్ డయాలసిస్ చేశారన్న వంశీ.. అలాగైతే పోస్టుమార్టంలో ప్రీతి బాడీలో ఉన్న ఇంజెక్షన్ గురించి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. నిమ్స్ లో ఏ వైద్యం చేశారో తమకు చెప్పాలని డిమాండ్ చేశారు ప్రీతి సోదరుడు వంశీ. ఇక ర్యాగింగ్ కమిటీపైనా తమకు అనేక
అనుమానాలు ఉన్నాయన్నారు. హెచ్ఓడీ తప్పు చేసిన వ్యక్తే అయితే ఆయనను ర్యాగింగ్ కమిటీలో ఎలా ఉంచుతారని ప్రశ్నించారు వంశీ.
ప్రీతి సెల్ ఫోన్ లో మేసేజ్ లు చెక్ చేశానన్న వంశీ.. తనకు కనిపించని మేసేజ్ లు పోలీసులకు ఎలా కనిపించాయో చెప్పాలన్నారు. అనస్థీషియా హెచ్ఓడీ.. కమిటీ రిపోర్టును మార్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు ప్రీతి సోదరుడు. ప్రీతిది హత్యేనని చెప్పడానికి తమ దగ్గర ఆధారాలు
ఉన్నాయని, ఆత్మహత్య అని చెప్పడానికి పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయా? అని నిలదీశారు. సైఫ్ తో మాట్లాడిన భార్గవి, అనూష, ఇతరులను విచారించాలని వంశీ డిమాండ్ చేశారు.
నవంబర్ 21న కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో అనస్తీషియా విభాగంలో మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యంది ప్రీతి. కాగా.. సెకండ్ ఇయర్ విద్యార్థి సైఫ్ తనను వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులకు ప్రీతి ఫిబ్రవరి 18న చెప్పింది. ప్రీతి తండ్రి నరేందర్ హైదరాబాద్‌లో రైల్వే ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తుండటంతో.. తనకున్న పరిచయాలతో ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే ఈ నెల 20న సైఫ్‌కు కేఎంసీ హెచ్‌ఓడీ.. మహిళా ప్రొఫెసర్లతో కౌన్సిలింగ్ ఇప్పించారు. ప్రీతి ఆత్మహత్యయత్నం చేసుకున్న రోజు రాత్రి విధుల్లో ఉంది. తెల్లవారుజామున 3 గంటల వరకు డ్యూటీ చేసింది. అనంతరం ఆత్మహత్యకు యత్నించింది.
ఆత్మహత్యకు యత్నించే కంటే ముందు ప్రీతి తన తల్లితో మాట్లాడింది. సైఫ్ తనతో పాటు చాలా మంది జూనియర్లని వేధిస్తున్నాడని వాపోయింది. సీనియర్లు అంతా ఒకటేనని చెప్పింది. సైఫ్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని తల్లితో చెప్పుకుంది. తాను సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే సీనియర్లందరూ ఒకటైపోయి తనను ఏం చేస్తారో అంటూ కన్నీటిపర్యంతమైంది. ఆత్యహత్యకు యత్నించిన ప్రీతి.. 5 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడింది. చివరికి తుదిశ్వాస విడిచింది. ఆమెని బతికించేందుకు నిమ్స్ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య బృందం తీవ్రంగా శ్రమించింది. కానీ ప్రయోజనం లేకపోయింది.