Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇంచార్జ్.. దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్.. ఎవరీ మీనాక్షి..
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంచార్జ్ లను నియమించింది.

Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇంచార్జ్ ని నియమించింది అధిష్టానం. ప్రస్తుత పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీని తప్పించి ఆమె స్థానంలో మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ కు ఆ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
2009లో మధ్యప్రదేశ్ లోని మందసౌర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి మీనాక్షి నటరాజన్ గెలుపొందారు. పార్టీలో పలు బాధ్యతలు నిర్వహించిన ఆమె.. ప్రస్తుతం రాహుల్ గాంధీ బృందంలో కీలకంగా ఉన్నారు.
తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంచార్జ్ లను నియమించింది. హిమాచల్ ప్రదేశ్, ఛండీగఢ్ కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంచార్జ్ గా రజనీ పాటిల్, హర్యానాకు బీకే హరిప్రసాద్, మధ్యప్రదేశ్ కు హరీశ్ చౌదరి, తమిళనాడు పుదుచ్చేరికి గిరీశ్ చోడాంకర్, ఒడిశాకు అజయ్ కుమార్ లల్లూ, జార్ఖండ్ కు కే.రాజు, మణిపుర్ త్రిపుర సిక్కిం నాగాలాండ్ కు సప్తగిరి శంకర్ ఉలక, బీహార్ కు క్రిష్ణ అల్లవరును ఇంచార్జ్ గా నియమించింది.
2009లో ఎంపీగా 30వేల ఓట్ల మెజార్టీతో ఆమె గెలిచారు. అయితే, 2014 2019 సాధారణ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో AICC పరిశీలకులుగా ఆమె పనిచేశారు. తెలంగాణలో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఇంచార్జ్ గా వచ్చారు మీనాక్షి. ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ నుండి కఠినమైన సవాల్ ను ఎదుర్కోనున్నారు.
Also Read : ఆ 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారా?
మీనాక్షి నటరాజన్ నేపథ్యం..
* మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలోని బిర్లాగ్రామ్ నగ్డాలో జననం.
* బయో కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్.
* న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ.
* దేవీ అహల్య యూనివర్సిటీలో చదువుకున్నారు.
* రత్లామ్ లో ఎన్ఎస్ యూఐ లో చేరిక ద్వారా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
* 1999 నుంచి 2002 వరకు NSUI అధ్యక్షురాలిగా పనిచేశారు.
* 2002-2005 వరకు మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేశారు.
* 2008లో AICC కార్యదర్శిగా ఎంపిక.
* 2009 నుంచి 2014 వరకు మందసౌర్ నుండి ఎంపీగా చేశారు.