కొన్ని గంటల్లో దంచికొట్టనున్నవానలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త.. పిడుగులు, ఉరుములతో కుండపోత వర్షం కురిసే చాన్స్..
రాష్ట్రంలోని ఆ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

Heavy rains
Rain Alert: తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, రాబోయే వారం రోజులు మరింత భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో రాష్ట్రంలోని పలుజిల్లాల్లో ఈనెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లా అక్కాపూర్ లో 11.05 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 8.93, అదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 7.28, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 6.70 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ పాటు నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో ఆదివారం అర్ధరాత్రి సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో నగర వాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. అదేవిధంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోనూ ఉరుములు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడుతాయని తెలిపింది.