Rain Alert
Rain Alert : తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు వర్షాలు (Rain Alert) దంచికొట్టనున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలతో ఆయా జిల్లాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, మరో నాలుగు రోజులు వర్షాలు పడుతాయని, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
దక్షిణ కర్ణాటక నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు తమిళనాడు అంతర్భాగంగా సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దాని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
అదేవిధంగా మంగళవారం అదిలాబాద్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
హైదరాబాద్‌లోనూ మోస్తరు నుంచి భారీ వర్షం పడనుంది. ఆదివారం ఉదయం మేఘావృతమై ఉంది. అయితే, పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని రాజేంద్రనగర్, బాలాపూర్, చంద్రాయణగుట్ట, మీర్ పేట్, ఎల్బీనగర్, చార్మినార్, బహుదూర్‌పురా, కిషన్‌బాగ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. ఆదివారం రోజంతా వాతావరణ చల్లబడి ఉంటుందని, పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.