Heavy Rains
Heavy Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణలో రెండు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదివారం రాత్రి హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. సిద్ధిపేట జిల్లా నారాయణపేటలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెంట్ ప్రాంతంలో 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ పరిధిలోనూ 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈనెల 18వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్, అసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసింది. గంట వ్యవధినేలోని జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఐదు నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముషీరాబాద్ పరిధిలో 10 నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో నగరంలో రోడ్లపైకి నీరు చేరి వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షం నేపథ్యంలో హైడ్రా, జీహెచ్ంఎంసీకి వచ్చిన ఫిర్యాదులను అధికారులు పరిష్కరిస్తూ.. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షం ధాటికి ఆదివారం రాత్రి హబీబ్‌నగర్‌లోని అఫ్జల్‌సాగర్ కాలువలో ఇద్దరు గల్లంతయ్యారు. వీరిద్దరి ఆచూకీకోసం పోలీసులు గాలింపు చేపట్టారు. అదేవిధంగా.. ముషీరాబాద్ లో ఓ యువకుడు నాలాలో కొట్టుకుపోయాడు. సంఘటన స్థలానికి హైడ్రా, జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది చేరుకొని గల్లంతైన వ్యక్తికోసం చర్యలు చేపట్టారు. బంజారాహిల్స్ లో జలమయమైన రహదారులను అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ పరిశీలించారు.