యూట్యూబ్‌లో చూసి.. నిద్రిస్తున్న స్నేహితుడి గొంతుకోసి.. ప్రియురాలితో కలిసి శరీరాన్ని ముక్కలు చేసి.. వామ్మో దారుణం.. పోలీసులకు ఎలా దొరికారంటే..

Crime News : ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన ఓ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ హత్య కేసులో బయటపడ్డ వాస్తవాలు

యూట్యూబ్‌లో చూసి.. నిద్రిస్తున్న స్నేహితుడి గొంతుకోసి.. ప్రియురాలితో కలిసి శరీరాన్ని ముక్కలు చేసి.. వామ్మో దారుణం.. పోలీసులకు ఎలా దొరికారంటే..

కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ తిరుపతిరెడ్డి, ఇతర పోలీసులు

Updated On : October 10, 2025 / 9:01 AM IST

Crime News : ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన ఓ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ హత్య కేసులో బయటపడ్డ వాస్తవాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇద్దరు పురుషుల మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారడం.. ఆ తరువాత వారి మధ్య అసహజ శృంగార బంధానికి దారితీయడం జరిగింది. ఈ క్రమంలో ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి రెండో వ్యక్తి అడిగినప్పుడల్లా డబ్బు అప్పుగా ఇచ్చేవాడు. అయితే, అతన్ని చంపితే ఆ డబ్బుంతా సొంతం చేసుకోవచ్చునని రెండో వ్యక్తికి దుర్భుది పుట్టింది. దీంతో మూడో వ్యక్తితో పాటు.. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళతో కలిసి ఆ వ్యక్తిని హత్య చేశాడు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన పరిమి అశోక్ ఎం.ఫార్మసీ పూర్తి చేశాడు. అతని తల్లిదండ్రులు చనిపోవడంతో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. అయితే, అతనికి వచ్చే జీతం సరిపోకపోవడంతో ఖమ్మంలో నివాసం ఉంటున్నాడు. ఖమ్మం అర్బన్ మండలంలోని ఓ గ్రామంలో కూరగాయలు సాగు చేశాడు. నష్టాలు రావడంతో అప్పులపాలయ్యాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయాగా పనిచేస్తున్న తిరుమలాయపాలెంకు చెందిన కొమ్ము నగ్మాతో అశోక్ కు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. వారిద్దరూ కలిసి ఖమ్మంలో ఉండేవారు.

కామేపల్లి మండలం కెప్టెన్ బంజరకు చెందిన గట్ల వెంకటేశ్వర్లుతో అశోక్ కు పరిచయం ఏర్పడింది. వెంకటేశ్వర్లు హైదరాబాద్ లో ఉండేవాడు. అయితే, వారి పరిచయం స్నేహంగా మారింది. దీంతో అశోక్ గదికి తరచూ వెంకటేశ్వర్లు వచ్చేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య స్నేహం కాస్త స్వలింగ సంపర్కానికి దారితీసింది. అశోక్ రూమ్‌కు వచ్చిన ప్రతిసారి వెంకటేశ్వర్లు అతనికి డబ్బులు ఇచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే అశోక్ కు డ్రిప్ కంపెనీలో పనిచేసిన పెంటి కృష్ణయ్యతో పరిచయం ఏర్పడింది. వారిద్దరూ వెంకటేశ్వర్లు వద్ద డబ్బు బాగా ఉందని, దాన్ని ఎలాగైనా కాజేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్వర్లును హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.

వెంకటేశ్వర్లును హత్య చేసేందుకు మర్డర్ కు సంబంధించిన వీడియోలను యూట్యూబ్‌లో చూశారు. చివరికి నిద్రలో ఉండగా గొంతుకోసి హత్య చేయాలని అనుకున్నారు. ఆ తరువాత శరీరాన్ని ఎలా ముక్కలు చేయాలి.. ఆ ముక్కలను ఎక్కడ పడేయాలి అనే విషయాలను యూట్యూబ్ వీడియోలో చూసి వెంకటేశ్వర్లు హత్యకు ప్లాన్ సిద్ధం చేశారు. ఇందుకోసం కత్తులను కూడా సిద్ధం చేసుకున్నారు.

సెప్టెంబర్ 15వ తేదీన రాత్రి వెంకటేశ్వర్లు అశోక్ రూమ్‌కు వచ్చాడు. అక్కడే నిద్రపోయాడు. 16వ తేదీ తెల్లవారుజామున అశోక్ తన ప్రియురాలు నగ్మాను బయట కాపులా ఉంచాడు. ఆ తరువాత స్నేహితుడు కృష్ణయ్యతో కలిసి అశోక్ రూమ్‌లోకి వెళ్లి నిద్రిస్తున్న వెంకటేశ్వర్లు గొంతుపై కత్తితో కోశారు. ఆ తరువాత అతని తల, మొండెం వేరు చేశారు. ముగ్గురు కలిసి మృతదేహాన్ని ముక్కలు చేశారు. ఆ ముక్కలను ఓ బస్తాలో వేసుకొని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి ఖమ్మం రూరల్ మండలం పరిధిలోని కరుణగిరి ప్రాంతంలో పడేశారు. ఎవరికీ అనుమానం రాకుండా గదిలో రక్తం మురకలను శుభ్రం చేశారు.

వెంకటేశ్వర్లు హైదరాబాద్ రాకపోవటంతో అతని సోదరుడు యాదయ్య సెప్టెంబర్ 22వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు వెంకటేశ్వర్లు ఫోన్ మాయం కావడం, ఆయన ఫోన్‌పే యాప్ నుంచి డబ్బులు బదిలీ అవుతుండటంతో అశోక్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా.. కృష్ణయ్య, నగ్మాతో కలిసి అశోక్ హత్యకు పాల్పడినట్లు తేలిసింది. నిందితుల వద్ద నుంచి 2.7తులాల బంగారం గొలుసు, నాలుగు ఫోన్లు, రెండు కత్తులు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.