Gangula Kamalakar: కోర్టులో జీవో నిలబడదని అందరికీ తెలుసు.. రేవంత్ ప్రభుత్వం బీసీలను మోసం చేసింది- గంగుల కమలాకర్
56 సార్లు సొంత పనుల కోసం సీఎం ఢిల్లీ వెళ్ళారు. ఇప్పుడు బీసీల కోసం ఒక్కసారి ఢిల్లీ వెళ్లండి.

Gangula Kamalakar: రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. ప్రతి అసెంబ్లీ సమావేశంలోనూ బీఆర్ఎస్ విధానాన్ని తాము స్పష్టంగా చెప్పామన్నారు. రిజర్వేషన్లు జీవో ద్వారా సాధ్యం కాదని, రాజ్యాంగ సవరణ జరిగితేనే ఫలితం ఉంటుందని చెప్పామని ఆయన గుర్తు చేశారు. తమిళనాడు వెళ్లి కూడా అధ్యయనం చేసి వచ్చి చెప్పామన్నారు. బీసీలను అవమానించేలా వ్యవహరించారని సీఎం రేవంత్ పై గంగుల కమలాకర్ ధ్వజమెత్తారు.
‘న్యాయస్థానంలో జీవో నిలబడదని సీఎం, మంత్రులు, అందరికీ తెలుసు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు జరపాల్సిందే. బీహార్, మహారాష్ట్ర తప్పిదాలు చేయవద్దని కోరాం. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాకే బీసీ రిజర్వేషన్లు పెంచుతామన్న రేవంత్ రెడ్డి జీవో ఎందుకు ఇచ్చారు? 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పిస్తామని జీఓ ఎందుకు ఇచ్చారు? బీసీలు ఏం చేస్తారులే అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లని జీవో ఇచ్చింది.
1992లో తమిళనాడు సీఎం జయలలిత ఎమ్మెల్యేలు, సిబ్బందిని ఢిల్లీ తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ల కోసం భీష్మించి కూర్చున్నారు. అప్పుడు కేంద్రం దిగి వచ్చి రాజ్యాంగ సవరణ చేయడం వల్ల తమిళనాడులో బీసీలకు రిజర్వేషన్లు పెరిగాయి. అందరం కలిసి రేపే ఢిల్లీ వెళ్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. బీఆర్ఎస్ నేతలం అందరం వస్తాం. 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఎన్నికలకు తొందర లేదు. రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించిన తర్వాతే నిర్వహించాలి. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీకి కదలాలి. రిజర్వేషన్ల అంశం తేలే వరకు హైదరాబాద్ రావొద్దు. 56 సార్లు సొంత పనుల కోసం సీఎం ఢిల్లీ వెళ్ళారు. ఇప్పుడు బీసీల కోసం ఒక్కసారి ఢిల్లీ వెళ్లండి. కేవలం జీఓతోనే రిజర్వేషన్లు సాధ్యమవుతాయని అనుకుంటే 22 నెలలు ఎందుకు ఆగారు? పల్లకి మోసి మా భుజాలు నొప్పి పెడుతున్నాయి. ఇప్పుడు పల్లకి ఎక్కుతాం. ఒక్క శాతం రిజర్వేషన్ వెనక్కు పోయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది” అని గంగుల కమలాకర్ హెచ్చరించారు.