Ponnam Prabhakar: బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం- మంత్రి పొన్నం ప్రభాకర్
స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడం లేదన్నారు.

Minister Ponnam Prabhakar
Ponnam Prabhakar: బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జీవో నెంబర్ 9పై స్టే విధిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కాపీ అందిన తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారాయన. ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించడం జరిగిందన్నారు. ప్రభుత్వం కుల సర్వే నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ వేసి, సబ్ కమిటీ వేసి, కేబినెట్ ఆమోదించి, శాసనసభలో చట్టం చేసి గవర్నర్ కి పంపడం జరిగిందన్నారు.
2018 పంచాయతీ రాజ్ చట్ట సవరణ చేశామని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన నిధులు రావడం లేదన్నారు. హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఆయన.. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు హైకోర్టులో ఎందుకు ఇంప్లీడ్ కాలేదో జవాబు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. మా నాయకుడు రాహుల్ గాంధీ నాయక్వతంలో సామాజిక న్యాయంతో ఎన్నికలకు వెళ్తామన్నారాయన.
అటు బీఆర్ఎస్ నేతలు రేవంత్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీని ఖుషీ చేసేందుకు, పదవులు కాపాడుకునేందుకు కాంగ్రెస్ నేతలు స్టంట్ చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రాష్ట్రపతిని కలవకుండానే ఢిల్లీలో ధర్నా చేసి హంగామా చేశారని ధ్వజమెత్తారు.
చట్టం ప్రక్రియ పూర్తి కాకముందే జీవో ఎలా తెస్తారని ఆయన సీఎం రేవంత్ ని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కోసం తెలంగాణలో బీసీలను బలి పెట్టి రోడ్లపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు.
హైకోర్టులో కేసు వేసింది కాంగ్రెస్ పార్టీ నేతలు కాదా?
”స్టే వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతూ వచ్చారు. మంత్రులు కోర్టులకు వెళ్లడానికి అది ఏమైనా టగ్ ఆఫ్ వార్ ఆటనా? బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందేందుకు బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపిందని కోర్టుకు ఏజీ స్పష్టంగా చెప్పారు. హైకోర్టులో కేసు వేసింది కాంగ్రెస్ పార్టీ నేతలు కాదా? ఆత్మ సాక్షిగా చెప్పండి. బీసీల చెవిలో పువ్వులు పెడతామంటే ఎవరూ నమ్మరు. బీసీలను దివాళా చేయించాలని కుట్ర పన్నారు. ఓసీ, బీసీల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారు. పిటిషన్లు వేసిన వారితో కనీసం మాట్లాడారా?
తెలంగాణ రోల్ మోడల్ అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమైంది? విజయవంతమైన తమిళనాడును అనుసరిస్తారా… లేక విఫలమైన రాష్ట్రాలను అనుసరిస్తారా? కాంగ్రెస్ లోని బీసీ నేతలు వాస్తవాలను గమనించాలి. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చాలి. పార్టీ అధినేత కేసీఆర్ తో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తాం” అని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.