summer season
Weather Update: వేసవికాలం మొదలైంది. రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. అయితే, రాబోయే ఐదు రోజులు ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. ముఖ్యంగా మార్చి 2 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 37 నుంచి 40 డిగ్రీలుదాటి టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
Also Read: Weather Update: ఈ సారి ఎండలు ఎలా ఉండనున్నాయో తెలుసా? అప్పట్లో ఎండలు మండిపోయినదానికంటే దారుణం
హైదరాబాద్ మహానగరంలో ఐదు రోజులు 34 నుంచి 37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ పేర్కొంది. ఎండలకుతోడు వేడి గాలులు వీస్తాయని, ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సూచించింది. ముఖ్యంగా చిన్న పిల్లలు, 65ఏళ్లు పైబడిన వారు, గుండె జబ్బులు, ఆస్తమా, మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం 11గంటల తరువాత అత్యవసరమైతేనే బయటకు రావాలని, ఒకవేళ మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఆ లక్షణాలుంటే వడదెబ్బే..
ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చే వాహనదారులు, చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎండలో ప్రయాణించినవారు హై టెంపరేచర్, వీక్నెస్, హెడెక్, తీవ్రమైన దాహం, గొంతు ఎండిపోవడం, చర్మం పొడిబారడం, చెమటలు రాకపోవడం, చర్మం ఎర్రగా మారడం, శ్వాస సమస్యలు, హార్ట్ బీట్ పెరగడం, వికారం, వాంతులు, మూర్చ వంటి అనారోగ్య సమస్యలుంటే వడదెబ్బ అని గ్రహించి హాస్పిటల్ కు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ జాగ్రత్తలు పాటించాలి..
♦ రోజుకు ఐదు లీటర్ల నీళ్లు తాగాలి. వేసవికాలంలో ఎండ వేడి వల్ల శరీరంలోని నీరంతా చెమట ద్వారా బయటికి వెళ్తుంది. బాడీలో నీటి శాతం బ్యాటెన్స్ గా ఉండాలంటే ఐదు లీటర్ల వాటర్ తాగాలి.
♦ మజ్జిగ, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, నేచురల్ ప్రూట్ జ్యూస్ తీసుకోవడం మంచిది.
♦ కూల్ డ్రింక్స్, ఫ్రైడ్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.
♦ ఎండ వేడి లోపలికి రాకుండా మధ్యాహ్నం ఇంటి తలుపులు మూసి ఉంచాలి.
♦ సాయంత్రం లోపలి గాలంతా బయటికి వెళ్లేందుకు తలుపులు తెరవాలి.
♦ కాటన్ డ్రెస్సులు వేసుకోవటం మేలు. దీంతో చెమట ద్వారా చర్మ వ్యాధులు రాకుండా జాగ్రత్తపడొచ్చు.