Etala Rajender comments : టీఆర్ఎస్ లో కాకరేపుతున్న ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్
రవీంద్రభారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం కార్యక్రమంలో పాల్గొన్న ఈటల.. హాట్ హాట్ కామెంట్స్ చేశారు. అధికార పార్టీలో ఆయనకు ఇబ్బందులేమైనా తలెత్తుతున్నాయా?

Minister Etala Rajender Hot Comments
Minister Etala Rajender hot comments : ఆయన ఏదీ డైరెక్ట్‌గా అనరు.. అలాగని అనకుండా ఊరుకోరు. అందుకే.. ఇన్‌డైరెక్ట్ డైలాగ్ పేలుస్తారు. ఇది మంత్రి ఈటల రాజేందర్ స్టైల్. పేరుకు తగ్గట్లే ఆయన చేసే కామెంట్స్ కూడా ఈటెల్లా దిగుతున్నాయ్ కొందరు టీఆర్‌ఎస్ పార్టీ నేతలకు. లేటెస్ట్‌గా ఆయన పేల్చిన డైలాగ్స్.. గులాబీ పార్టీలో కొత్త కాక రేపుతున్నాయి… ఆయన చేసే కామెంట్స్ వెనక.. కచ్చితంగా ఏదో పరమార్థం ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది..
శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం కార్యక్రమంలో పాల్గొన్న ఈటల.. హాట్ హాట్ కామెంట్స్ చేశారు. తాను మంత్రి కావచ్చు.. కానీ ముందుగా మనిషిని అన్నారు… ఆ తర్వాత మెరిట్ లేనిదే టీచర్ కారు.. డాక్టర్ కారు.. అలాంటప్పుడు పాలించే వాడికి కూడా మెరిట్ ఉండాలన్నారు ఈటల. మనలో చైతన్యం తగ్గిందని అనుకోవచ్చు.. కానీ అవసరం వచ్చినప్పుడు అది మండుతుందన్నారు.
ఇప్పుడే కాదు గతంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఓ రైతు వేదిక ప్రారంభోత్సవంలో.. మంత్రి ఈటల రాజేందర్ తన గళాన్ని వినిపించారు. ప్రభుత్వ పథకాలు.. ప్రజలను పేదరికం నుంచి బయటపడేయలేవని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్యాణ లక్ష్మి, పించన్లు, రేషన్ కార్డులు.. పేదరికానికి పరిష్కారం కావన్నారు. జనాన్ని.. వాళ్ల కాళ్లమీద వాళ్లను నిలబడేలా చేయాలంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈటల గతంలో కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ పథకాలపై విమర్శలతో పాటు ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోయినా.. శాశ్వతంగా ఓడిపోవన్నారు. కులం, డబ్బు, పార్టీ జెండా కాదు.. మనిషిని గుర్తుపెట్టుకోవాలంటూ హితబోధ చేశారు. తాను ఇబ్బంది పడుతున్నా.. గాయపడుతున్నా.. మనసు మార్చుకోలేదన్నారు. పెట్టిన చెయ్యి ఆగదని.. చేసే మనిషిని ఆగనని ఈటల చెప్పారు. ఎవరిని ఉద్దేశించి.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారన్నదే అప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.
ఆ మధ్య హుజురాబాద్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ.. గులాబీ జెండాకు తాము కూడా ఓనర్లేమంటూ ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్‌లో అధికార మార్పిడి జరగబోతోందని ప్రచారం జరిగిన సమయంలో.. రాజేందర్ చేసిన ఈ కామెంట్స్.. పార్టీలో అలజడి రేపాయ్.
ఈటల చేసే కామెంట్స్ చూస్తుంటే.. అధికార పార్టీలో ఆయనకు ఇబ్బందులేమైనా తలెత్తుతున్నాయా? ఆయన్ని ఎవరైనా టార్గెట్ చేశారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. కానీ ఈ వ్యాఖ్యల తర్వాత ఆయన సీఎం కేసీఆర్‌తో భేటీ అవుతారు.. కొన్ని రోజులు మళ్లీ సైలెంట్ గా ఉంటారు.. ఆ తర్వాత మళ్లీ షరా మాములుగానే బాంబు పేలుతోంది. అసలు ఈటల మనసులో ఏముంది? ఆయన ఆవేదన, బాధ వెనక కారణాలేంటి? అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకడం లేదు.