ఖైరతాబాద్ లో మంత్రి కిషన్ రెడ్డి పర్యటన, జీహెచ్ఎంసీ అధికారులపై సీరియస్

Minister Kishan Reddy : ఖైరతాబాద్ ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటిస్తున్నారు. వరద ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారుల తీరును ఆయన తప్పుబట్టారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పై సీరియస్ అయ్యారు. ఆయనకు ఫోన్ చేసి..మండిపడ్డారు.
తన పర్యటన సందర్భంగా అధికారులు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈ, ఏఈ స్థాయి అధికారులను పంపించకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. తాను పర్యటిస్తే..కొన్ని సమస్యలను తీరుతాయని అనుకున్నట్లు, కానీ అధికారులు స్పందించడం లేదన్నారు. వెంటనే ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అక్కడకు చేరుకున్నారు.
రెండు రోజుల నుంచి కరెంటు లేదని, తినడానికి ఆహారం లేకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కనీసం వరద నీటిని బయటకు పంపించే ప్రయత్నం చేయరా ? అంటూ ప్రశ్నించారు. నిత్యావసర వస్తువులను వెంటనే పంపిణీ చేయాలని సూచించారు.
వాయుగుండం దెబ్బకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. భారీ వర్షాలు తెలంగాణ, ఏపీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ప్రజలపై ప్రభావం చూపాయి. ఎడతెరిపిలేని వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగాయి. చెరువులు మత్తడి దుంకాయి. చెరువులకు గండ్లు పడి రోడ్లన్నీ కాల్వల్లా మారిపోయాయి. వరదల్లో చిక్కుకుపోయి పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు విడిచారు.
వాన బీభత్సవానికి రహదారులు సైతం కొట్టుకుపోయాయి. చాలావరకు ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. నిత్యావసర వస్తువులు కూడా తడిసిపోయి ఆకలితో అలమటించారు. హైదరాబాద్‌పై జలఖడ్గం వేలాడుతుంది. మంగళవారం నుంచి కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పాత ఇళ్లు కూలిపోయాయి. కొత్త ఇళ్లల్లోకి వరదనీరు చేరింది. నాలాలు ఉప్పొంగాయి. మ్యాన్ హోల్స్ నోళ్లు తెరిచాయి.
చెట్లు నేలకూలాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. 24 గంటల వ్యవధిలో 24 మంది మృత్యువాత పడ్డారని అధికారులు చెబుతున్నారు. రోడ్లపైనే పడవల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరం నరకకూపంగా మారిపోయింది. వరద దెబ్బకు తెలంగాణ ప్రభుత్వం ఇవాళ కూడా ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులకు సెలవులు ప్రకటించింది.