Ponguleti Srinivas Reddy : వారికి మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు..!- మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక వ్యాఖ్యలు..

ఒకరోజు ముందో వెనకో.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది..

Ponguleti Srinivas Reddy : త్వరలోనే అర్హులందరికీ పథకాలు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో తప్పులకు ఆస్కారం లేదని మంత్రి పొంగులేటి తేల్చి చెప్పారు. ఈడీ రెయిడ్స్ విషయంలోనూ చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి.

త్వరలో కొత్త రేషన్ కార్డులు..
ఆ నాటి ప్రభుత్వం ఏ నియమ నిబంధనలు పెట్టిందో వాటికి తగ్గకుండా పేదలందరికీ, అర్హులైన వారందరికీ ఎన్ని లక్షల కొత్త రేషన్ కార్డులైనా ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది. అది కూడా జనవరి 26వ తేదీ నుంచి ఇవ్వాలని నిన్న కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.

Also Read : నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు.. అక్రమాలు, వసూళ్ల ఆరోపణలతో డీజీపీ ఆఫీస్‌కు అటాచ్

రెండు విడతల్లో సాయం..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా, పీకలదాకా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ఆనాటి ప్రభుత్వం కూర్చినా.. ఇచ్చిన మాట ప్రకారం సాగుకి యోగ్యమైన ప్రతి ఎకరాకి సంవత్సరానికి 12వేల రూపాయలు ఇవ్వాలని, అది కూడా జనవరి 26వ తేదీ నుంచి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు..
ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా నిష్పక్షపాతంగా ఎవరైతే పేదలు, అర్హులైన వారికి, పేదలలో బహు పేదలకు టాప్ ప్రయారిటీ ఇచ్చి, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3వేల 500 ఇళ్ల చొప్పున ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో అదనంగా కొన్ని ఇస్తాం.

చట్టం తన పని తాను చేసుకుపోతుంది..
ఆ నాటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు.. కార్యక్రమాలు, గొప్పలు చేశామని చెబుతున్నారు. వాళ్లు పెట్టిన ఒత్తిడితో ఈ తప్పులు చేశామని అధికారులు ఒప్పుకుంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వాళ్లు మంత్రులుగా ఉన్నప్పుడు ఇదే మాట చెప్పేవారు. ఇక్కడ వ్యక్తులను ఇబ్బంది పెట్టాలనో, తప్పుడు కేసులు బనాయించాలనో ఈ ప్రభుత్వానికి లేదు. ఒకరోజు ముందో వెనకో.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

 

Also Read : టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్‌గా దానం నాగేందర్.. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఎందుకు మాట్లాడుతున్నట్లు?