నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు.. అక్రమాలు, వసూళ్ల ఆరోపణలతో డీజీపీ ఆఫీస్‌కు అటాచ్

ఏడేళ్ల క్రితం నల్గొండ జిల్లాలో డీఎస్పీగా చేరారు గంజి కవిత. ఇప్పటివరకు ఎస్పీగా పనిచేసిన ఆమెపై ఈ మధ్య కాలంలో తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటు.. అక్రమాలు, వసూళ్ల ఆరోపణలతో డీజీపీ ఆఫీస్‌కు అటాచ్

Updated On : January 11, 2025 / 9:04 PM IST

ఇంటెలిజెన్స్ ఎస్పీగా ఉన్న ఆమె..అక్రమాల కోసం తన ఇంటెలిజెన్స్‌ను వాడి.. అడ్డంగా బుక్కయ్యారు. పోలీస్ నిఘా విభాగం జిల్లా ఎస్పీగా పనిచేస్తూ గాడి తప్పిన నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఇంటెలిజెన్స్‌ విధుల నుంచి తప్పించి డీజీపీ ఆఫీస్‌కు అటాచ్‌ చేశారు. రాష్ట్రంలోని కీలకమైన జిల్లాను పర్యవేక్షించే బాధ్యతల్లో ఉన్న ఆమె అడ్డూ అదుపు లేకుండా అక్రమ వసూళ్ల దందా చేయడం వల్లే వేటు వేసినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నమాట.

ఏడేళ్ల క్రితం నల్గొండ జిల్లాలో డీఎస్పీగా చేరారు గంజి కవిత. ఇప్పటివరకు ఎస్పీగా పనిచేసిన ఆమెపై ఈ మధ్య కాలంలో తీవ్ర స్థాయిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తన సిబ్బందితో పాటు కిందిస్థాయి అధికారుల నుంచి అప్పులు, చేబదుళ్లు తీసుకోవడం.. తిరిగివ్వమంటే ఇంటెలిజెన్స్‌ నివేదికల పేరుతో బెదిరించినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లిందట. నాగర్ కర్నూర్‌ జిల్లా మన్ననూరు దగ్గర ఆమె పెద్ద హోటల్‌ను నిర్మించారని అంటున్నారు. ఆ హోటల్‌కు వంట సరకుల సరఫరాలో సిబ్బందికి ఇండెంట్లు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన ఇంట్లో జరిగిన వేడుకలకు బహుమతులు తీసుకురావాలంటూ కిందిస్థాయి సిబ్బందికి హుకుం జారీ చేయడం కూడా పోలీస్‌ అధికారుల్లో వ్యతిరేకత వ్యక్తం అవడానికి కారణమైందట.

కవిత అక్రమాలపై బాధితులు 9 పేజీల లేఖ
ఆమె వసూళ్ల దందాపై సొంత శాఖ సిబ్బందే ఉన్నతాధికారులకు లేఖ రాశారు. కవిత అక్రమాలపై బాధితులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. ఇంటెలిజెన్స్‌ విభాగంలో పోస్టింగ్‌ల కోసం లంచం వసూలు చేసినట్లు ఆరోపించారు. వివిధ సందర్భాల్లో క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం భారీగా వసూళ్లు చేశారట. అంతే కాకుండా సిబ్బందితో అధిక వడ్డీ, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కూడా చేయించినట్లు లేఖలో తెలిపారు. ఆ లెటర్‌ ఆధారంగా విచారణ చేపట్టి..15 రోజులుగా కవిత అక్రమాలపై ఫోకస్ పెట్టిన రాష్ట్ర ఇంటెలిజెన్స్ నిఘా విభాగం.. గంజి కవిత అడ్డగోలు వ్యవహారంపై కొన్ని వివరాలు బయటికి తీసినట్లు ప్రచారం జరుగుతోంది.

నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్‌ అధికారిగా గంజి కవిత ఏడేళ్లు పనిచేశారు. ఈ ఏడేళ్లలో ఆమె రేషన్‌, గుట్కా మాఫియాల నుంచి భారీగా ఆమె వసూళ్లు చేసినట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గతంలో ఇంటిలిజెన్స్‌లో చేసినవారితో షాడో టీమ్ ఏర్పాటు చేసుకున్న కవిత..ఓ ఏఎస్పీ, ఒక డీఎస్పీ, ఒక సీఐ, పలువురు ఎస్సైలు, కానిస్టేబుళ్లతో కవిత ఈ దందా నడిచిపించినట్లు ప్రచారం జరుగుతోంది. కవిత అక్రమాల్లో ఒక ఎస్ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక హెడ్ కానిస్టేబుల్ పాలు పంచుకున్నట్లు పోలీస్ శాఖలో ఇన్‌ సైడ్‌ టాక్. దీంతో ఆమె షాడో టీంపైనా విచారణ కొనసాగుతోందట. సమగ్ర విచారణ తర్వాత కవితను సస్పెండ్‌ చేయడంతో పాటు ఆమె షాడో టీమ్‌లో ఉన్నవారిపైనా వేటు వేసే యోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

కవిత అక్రమాల చిట్టా..
అయితే ప్రాథమిక విచారణలోనే ఎస్పీ కవిత అక్రమాల చిట్టా ఉన్నతాధికారులను నివ్వెర పరుస్తుందట. 7 ఏళ్లుగా జిల్లాలో డీఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీ హోదాలో నిఘా విభాగం అధిపతిగా పనిచేసిన ఆమె..సొంత శాఖ సిబ్బందిని కూడా వదలకపోవడం చర్చకు దారి తీసింది. గత ఇంటిలిజెన్స్ చీఫ్ సపోర్ట్ ఉండటంతో జిల్లా ఎస్పీలను కూడా లెక్కచేయకుండా కవిత అక్రమ వసూళ్లు చేసుకుంటూ పోయారని పోలీస్‌ శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పలు సందర్భాల్లో ఆమె స్పెషల్ బ్రాంచ్ నివేదికలకు విరుద్ధంగా ఇంటిలిజెన్స్ నివేదికలు పంపేవారని..కవిత కావాలనే రిపోర్ట్‌లు మార్చి పంపినట్టు అధికారులు నిర్ధారించారట.

అందరి మీద నిఘా పెట్టి యాక్షన్‌ తీసుకోవాల్సిన ఆఫీసర్‌..సొంత శాఖ సిబ్బంది లేఖతో కార్నర్ అయిపోవడం ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. అంతేకాదు ఆమె ఇంటెలిజెన్స్ విభాగంగా ఎస్పీగా ఉండగానే..రాష్ట్ర ఇంటెలిజెన్స్ టీమ్‌ కవిత అక్రమాలపై నిఘా పెట్టడం మరింత సినిమాటిక్‌గా మారింది.

ఈ నేపథ్యంలో ఎస్పీ కవితపై వేటు పడింది. పూర్తిస్థాయి విచారణ తర్వాత ఏం జరగబోతుందనేది ఉత్కంఠ రేపుతోంది. ఎస్పీ కవిత వరకే చర్యలు ఉంటాయా లేక..ఆమె షాడో టీమ్‌ చిట్టా కూడా బయటికి తీస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. కవితతో కలిసి అక్రమాలకు పాల్పడిన అధికారులను బదిలీలు, అటాచ్‌మెట్లను సరిపెడుతారా లేక సస్పెండ్‌ చేస్తారా అన్నది కూడా ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌గా మారింది. చూడాలి మరి ఇంటెలిజెన్స్ ఎస్పీ కవిత నిఘా చిత్రాలు ఇంకేమేం ఉన్నాయో.

Chandrababu Naidu: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై బాబు మార్క్ డెసిషన్స్..!