Chandrababu Naidu: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై బాబు మార్క్ డెసిషన్స్..!

గత సర్కార్ ప్రతిపాదించిన ప్రకారం లక్షా 61 వేల సచివాలయ ఉద్యోగులు ఉండాల్సి ఉండగా.. లక్షా 27వేల మంది మాత్రమే ఉన్నారట.

Chandrababu Naidu: గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై బాబు మార్క్ డెసిషన్స్..!

CM Chandrababu Naidu

Updated On : January 11, 2025 / 8:30 PM IST

వ్యవస్థ అధికారం పార్టీ చెప్పు చేతుల్లో ఉండకూడదు. పవర్‌లో ఉన్న పార్టీ చెప్పినట్లు కాకుండా..అధికారులు, వ్యవస్థ ప్రజల కోసం తన పని తాను చేసుకుపోవాలంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందుకే వైసీపీ హయాంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో అడ్డగోలుగా నియమించిన ఉద్యోగుల విషయంలో ప్రక్షాళనకు ప్లాన్ చేస్తున్నారు.

ఉద్యోగుల షఫ్లింగ్‌ మీద దృష్టి పెట్టారు. జనాభాకు అనుగుణంగా ఉద్యోగులు ఉండాలి కానీ..ఇష్టం వచ్చినట్లు ఎంప్లాయిస్‌ను పెట్టి జీతాలు చెల్లించుకుంటూ పోతే ఏం లాభమని అధికారులను ప్రశ్నించారు బాబు. అందుకే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రేషనలైజేషన్‌ చేయాలని నిర్ణయించారట. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో కొన్ని చోట్ల ఎక్కువ సిబ్బంది ఉండగా, మరికొన్ని చోట్ల తక్కువగా ఉన్నారు. అందుకే మల్టీపర్పస్‌ ఫంక్షనరీస్, టెక్నికల్‌ ఫంక్షనరీస్, యాస్పిరేషనల్‌ సెక్రటరీలుగా సచివాలయ ఉద్యోగులను మూడు కేటగిరీలుగా విభజించాలని డిసైడ్ అయ్యారట.

కనీసం 2వేల 5వందల మందికి ఒక సచివాలయం..లేదా ప్రతీ 5 కి.మీ పరిధిలో ఒక గ్రామ సచివాలయం ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారట సీఎం చంద్రబాబు. సచివాలయ అధిపతిగా పంచాయతీ కార్యదర్శి లేకపోతే వార్డు పరిపాలన కార్యదర్శి ఉంటారని..పనితీరును బేస్‌ చేసుకుని ఉద్యోగులకు బహుమతులు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ఏరియాల్లో అదనంగా సచివాలయాలు పెట్టాలని సూచించారు.

ఉన్నవారినే సమర్థంగా వాడుకుంటారా?
అయితే గత సర్కార్ ప్రతిపాదించిన ప్రకారం లక్షా 61 వేల సచివాలయ ఉద్యోగులు ఉండాల్సి ఉండగా.. లక్షా 27వేల మంది మాత్రమే ఉన్నారట. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విధానంతో తక్కువ ఉద్యోగులతో మెరుగైన సేవలు పొందే అవకాశం ఉందట. ఉన్నవారిని సమర్థంగా వాడుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని భావిస్తున్నారట. ఉద్యోగుల రేషనలైజేషన్‌తో 15 వేల మంది సచివాలయ ఉద్యోగులు అదనంగా ఉంటారని లెక్కలు వేసుకుంటున్నారు. వారిని మిగతా శాఖలకు అటాచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

2500 జనాభాలోపు ఉంటే ఇద్దరు మల్టీపర్పస్‌ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్‌ ఫంక్షనరీస్‌ అందుబాటులో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. 2500 నుంచి 3500 జనాభాకు ముగ్గురు మల్టీపర్పస్‌ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్‌ ఫంక్షనరీస్‌ను నియమిస్తారు. 3వేల 5వందలకు పైగా జనాభా ఉంటే నలుగురు మల్టీపర్పస్‌ ఫంక్షనరీస్, నలుగురు టెక్నికల్‌ ఫంక్షనరీస్‌ను గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని భావిస్తున్నారు.

ఖర్చులను తగ్గిస్తారా?
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక.. అడ్డగోలు ఖర్చులను తగ్గించే పనిలో పడింది. అందులో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయాల్లో అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను..రేషనలైజేషన్‌ ద్వారా మూడు విభాగాలుగా విభజించి..ఓ సిస్టమ్‌ ప్రకారం సేవలు అందేలా ప్లాన్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు.

దానిలో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయాలను క్రమబద్దీకరిస్తున్నట్లు చెప్తున్నారు. 2500లోపు జనాభా వరకూ ఒక తరహా సచివాలయం, 2500 నుంచి 5వేల జనాభా వరకూ ఒక తరహా, 5వేలు పైబడిన వాటిని మరో జాబితాలోకి తెచ్చి అందుకు అనుగుణంగా ఉద్యోగుల సర్ధుబాటు చేస్తామంటున్నారు. చిత్తూరు జిల్లాను పైలట్‌ ప్రాజెక్టు కింద తీసుకుంటే..అక్కడ అవసరానికి మించి వ్యవసాయ శాఖలో ఎక్కువ ఉద్యోగులు ఉన్నారట. ఈ తరహాలో నివేదికలు తెప్పించుకుని ఉద్యోగుల సర్దుబాటు చేయాలని ప్లాన్ చేస్తున్నారట. చూడాలి మరి సీఎం చంద్రబాబు కాస్ట్ కటింగ్‌ ఎంత వర్కౌట్ అవుతుందనేది.

టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్‌గా దానం నాగేందర్.. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఎందుకు మాట్లాడుతున్నట్లు?