టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్‌గా దానం నాగేందర్.. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఎందుకు మాట్లాడుతున్నట్లు?

లేటెస్ట్‌గా దానం కేసీఆర్‌ను పొగడటం.. ఫార్ములా ఈ రేస్‌ విషయంలో కేటీఆర్‌కు అనుకూలంగా మాట్లాడటం వంటివి చర్చకు వస్తున్నాయి.

టాక్ ఆఫ్ ది తెలంగాణ పాలిటిక్స్‌గా దానం నాగేందర్.. ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఎందుకు మాట్లాడుతున్నట్లు?

Updated On : January 11, 2025 / 8:31 PM IST

మాస్‌ లీడర్‌.. దానం నాగేందర్ రూటే సెపరేటు. ఆయన ఏ పార్టీలో ఉన్న..ఏ పదవిలో ఉన్న..ఎప్పుడు ఏదో ఒక ఇష్యూతో టాక్ ఆఫ్‌ ది మీడియాగా మారుతుంటారు. పక్కా హైదరాబాదీ స్లాంగ్‌తో డైలాగులు పేల్చుతూ, ధమ్కీలు ఇస్తూ తన హవా నడిపిస్తుంటారు. అయితే మొన్నటి ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ గూటికి చేరిన దానం నాగేందర్‌ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైందట. మంత్రి పదవి వస్తుందన్న ఆశతో హస్తం పార్టీలో చేరిన ఆయనకు అమాత్య యోగం దక్కలేదు.

పైగా ఆయనకు ఇష్టం లేకపోయినా లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేయించారట కాంగ్రెస్ పెద్దలు. ఆ తర్వాత అయినా మంత్రి పదవి వస్తుందని ఆశిస్తే భంగపాటు తప్పదని భావిస్తున్నారట. పైగా తను ఏదైనా పని చేయాలని అడిగితే ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదని గుస్సా అవుతున్నారట దానం. అందుకే కొన్నాళ్లుగా కాంగ్రెస్ సర్కార్ పెద్దలు, సీఎం రేవంత్‌ తీరుపై అసంతృప్తితో ఉన్నారట. ఈ నేపథ్యంలో దానం టంగ్‌ చేంజ్‌ చేశారన్న టాక్ వినిపిస్తోంది.

వైఎస్ హయాంలో గ్రేటర్ హైదరాబాద్‌లో రాజకీయంగా ఓ ఊపు ఊపిన దానం.. 2014 తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ పదవిలో ఉండలేకపోయారు. 2014లో ఓడిన దానం.. తిరిగి 2018లో ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్‌ గూటికి చేరారు. కేసీఆర్ క్యాబినెట్‌లో బెర్త్ ఆశించినా దక్కలేదు. తర్వాత హస్తం గూటికి చేరినా ఆయనను పట్టించుకునే నాధుడే లేడట. అందుకే దానం రూటు మార్చినట్లు చర్చ జరుగుతోంది. ఓ వైపు ప్రభుత్వాన్ని, మరోవైపు కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతుండటంతో..ఈ వలస ఎమ్మెల్యే వ్యవహారం ఇబ్బందికరంగా మారిందని గాంధీభవన్ టాక్.

అందుకే సైలెంట్?
పవర్ ఎక్కడుంటే దానం నాగేందర్ అక్కడుంటాడన్నది పబ్లిక్ మాట. అందుకు అనుగుణంగానే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆయన హస్తం పార్టీలోకి వెళ్లారు. కాంగ్రెస్ బీఫామ్‌ మీద ఎంపీగా పోటీ చేయడంతో ఆయనపై అనర్హత వేటు పడటం ఖాయమన్న చర్చ జరుగుతోంది. అయితే ఖైరతాబాద్ బైపోల్‌ వస్తే దానంకు టికెట్ ఇవ్వకూడదని హస్తం పార్టీ డిసైడ్ అయ్యిందన్న చర్చ కూడా జరిగింది. ఈ విషయాలన్నీ కాస్త ఆలస్యంగా గ్రహించిన దానం కొంత సైలెంట్ అయిపోయారట.

ఇక ఊరికే ఉండలేకే సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా మాట్లాడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది. రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా ఉన్నాయంటున్నారు.

ఈ కార్ రేస్‌తో హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరిగిందని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అదే విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారని దానం నాగేందర్ అంటుండంతో ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఈ కార్ రేస్ వ్యవహారంలో అవినీతి జరిగిందని, దాన్ని నిరూపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో అధికార పార్టీలో ఉండి దానం నాగేందర్‌ ప్రతిపక్ష నేతకు అనుకూలంగా మాట్లాడటం ఏంటన్న చర్చ జరుగుతోంది.

ఈ ఒక్క ఇష్యూనే కాదు పలు సందర్భాల్లో దానం చేసిన కామెంట్స్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బందికరంగా మారాయన్న చర్చ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలను విమర్శించేలా, సర్కార్‌ను కార్నర్ చేసేలా దానం కామెంట్స్ చేస్తున్నారని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట. చెరువుల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన హైడ్రాకు వ్యతిరేకంగా విమర్శలు చేసి ఇటు ప్రభుత్వాన్ని, అటు పార్టీని ఇరుకునపడేలా చేశారు దానం నాగేందర్.

రేవంత్ అండ్ టీంకు ఏం చేయాలో అర్థం కావడం లేదా?
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన దానం.. పరోక్షంగా ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చారని అప్పట్లో చర్చ జరిగింది. ఇక అల్లుఅర్జున్ అరెస్ట్ ఇష్యూలో కూడా దానం నాగేందర్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టడం చర్చనీయాంశమవుతోంది. అల్లుఅర్జున్ అరెస్ట్‌ సరికాదని, పార్టీకి నష్టమంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేయడంతో..రేవంత్ అండ్ టీంకు ఏం చేయాలో అర్థం కావడం లేదట.

అయితే దానం నాగేందర్ ఇలా ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం వెనుక అసలు కారణం వేరే ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తన వ్యక్తిగత సమస్యలు కొన్నింటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరగా..సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులెవరు పెద్దగా పట్టించుకోవడం లేదట. అందుకే దానం ప్రభుత్వాన్ని, పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారని అంటున్నారు. రివర్స్ గేర్‌ వేస్తేనే తనను పిలిచి బుజ్జగించి, అడిగిన పనులన్నీ చేసిపెడతారని దానం భావిస్తున్నారట.

ఈ నేపథ్యంలోనే లేటెస్ట్‌గా దానం కేసీఆర్‌ను పొగడటం..ఫార్ములా ఈ రేస్‌ విషయంలో కేటీఆర్‌కు అనుకూలంగా మాట్లాడటం వంటివి చర్చకు వస్తున్నాయి. అయితే దానం తిరిగి కారు ఎక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ మాత్రం దానం లాంటి లీడర్లను తీసుకోవద్దని.. అలాంటి నేతలను ఎంకరేజ్‌ చేయొద్దని డిసైడ్ అయిందట. సో అటు హస్తం పార్టీలో తన పనులు చక్కబెట్టుకోలేక..తిరిగి గులాబీ కండువా కప్పుకునే పరిస్థితి లేక..డైలమాలో ఉన్నారట దానం. అందుకే పొలిటికల్ రివర్స్ గేర్ వేశారని అంటున్నారు. దానం కామెంట్స్‌ మీద కాంగ్రెస్‌ నేతలు ఎలా స్పందిస్తారనేది చూడాలి మరి.

తిరుపతి తొక్కిసలాట ఘటనలో బాబు క్విక్ రియాక్షన్.. బాధితుల పక్షాన నిలిచి ప్రతిపక్షానికి వాయిస్ లేకుండా ప్లాన్!