Vemula Prasanth Reddy: బీజేపీ ప్రభుత్వం వల్లే తెలంగాణ రైతులకు సమస్య: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

తెలంగాణ నుంచి యాసంగి వడ్లు కొనుగోలు చేయడంలో కేంద్రం తొండి చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.

Vemula Prasanth Reddy: తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర – కేంద్ర ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ కొనబోమంటూ కేంద్రం స్పష్టం చేయగా..కేంద్రమే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. తెలంగాణ నుంచి యాసంగి వడ్లు కొనుగోలు చేయడంలో కేంద్రం తొండి చేస్తోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నిజామాబాదు జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని..బీజేపీ ప్రభుత్వం వల్లే తెలంగాణ రైతులకు సమస్య వచ్చి పడిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలకు నూకలు తినే అలవాటు చేయాలంటూ వ్యాఖ్యానించి కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ఈ రాష్ట్ర ప్రజలను అవమానించారని ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.

Also read:Piyush Goyal On Rice : ఒక స్థాయి వరకే సహకారం ఇవ్వగలం-పీయూష్ గోయల్

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..రైతులను రెచ్చగొట్టి వరి సాగు చేయాలని చెప్పారని..బండి సంజయ్ కి దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ ధాన్యాన్ని కొనిపించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి సవాల్ విసిరారు. వడ్లు కొనేందుకు కేంద్రానికి రాష్ట్రం డబ్బులివ్వాలని ఎంపీ అర్వింద్ చెప్పడం సిగ్గు చేటన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.. ఎంపీ అర్వింద్ తెలివి తక్కువగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నిజామాబాద్ కు పసుపు బోర్డు తెచ్చి ఎంపీ అర్వింద్ మాట్లాడాలంటూ ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ధాన్యం కొనే బాధ్యత కేంద్రానిదేనని, కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనే వరకు పోరాటం చేస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రంపై పోరాటంలో భాగంగా సోమవారం జరిగే జిల్లా స్థాయి నిరసన దీక్షలను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

Also read:Bharat BioTech: ఐక్యరాజ్యసమితి ద్వారా కొవాగ్జిన్ సరఫరాను నిలిపివేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ట్రెండింగ్ వార్తలు