నేను లోకల్- కమిషనర్ రంగనాథ్ వర్సెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్

అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

నేను లోకల్- కమిషనర్ రంగనాథ్ వర్సెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్

Updated On : August 13, 2024 / 7:11 PM IST

Mla Danam Nagender Warning : హైదరాబాద్ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. నందగిరి హిల్స్ లోని జీహెచ్ఎంసీకి చెందిన స్థలంలో కొందరి నివాసాలను కావాలనే తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. రంగనాథ్ కు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లు ఉందన్నారు దానం నాగేందర్. అందుకే తనపై కేసులు పెట్టారని మండిపడ్డారు. అధికారులు వస్తుంటారు, పోతుంటారు.. నేను లోకల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు దానం. నందగిరి హిల్స్ హుడా లేఔట్ లో ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని తెలిసి తాను అక్కడికి వెళ్లానని దానం చెప్పారు. అక్కడ జరిగిన విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. అక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించడం తన బాధ్యతని ఆయన స్పష్టం చేశారు.

నందగిరి హిల్స్ ఘటనపై అధికారులకు ప్రివిలేజేషన్ నోటీసులు ఇస్తానని దానం నాగేందర్ చెప్పారు. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. గతంలోనూ తనపై కేసులు పెట్టారని, ఇప్పటి కేసులు తనకు కొత్తేమీ కాదన్నారు. పేదల కోసం ఎన్ని కేసులైనా భరిస్తానన్నారు.

అంతకుముందు నంది హిల్స్ ఘటనలో ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 69లో ప్రభుత్వ స్థలంలో ప్రహరీని ఈ నెల 10న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలో గురుబ్రహ్మ నగర్ కి చెందిన గోపాల్ నాయక్, రాంచందర్ నాయక్ తదితరులు కూల్చివేత ఘటనలో ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రహరీ కూల్చివేతతో రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదు చేశారు. ఈ కేసులో దానం నాగేందర్ ను ఏ-3గా పోలీసులు చేర్చారు.

”మీరు గుడిసెల్లో వేలు పెట్టొద్దు. నాలాల మీద ఉంటే తీసేయ్. ప్రభుత్వ స్థలం కబ్జా చేస్తే తీసేయ్. పార్టీలు వాళ్లు ఎవరైనా కబ్జా చేస్తే తీసేయ్. నీకు సీఎం అధికారం ఇచ్చారు. కానీ, గుడిసెలు ఉండొద్దు, అంటరాని వాళ్లు ఉండొద్దు, ఎస్సీలు, ఎస్టీలు ఉండొద్దు, మాలలు, మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరు ఎవరు? ఇది ఎస్టీల బస్తీ. ఎస్టీల కోసం కేటాయించిన బస్తీ. వాళ్లకు ప్రభుత్వపరంగా గెజిట్ ఇచ్చారు. భవనాలు ఆల్రెడీ ఒక స్టేజ్ కి వచ్చాయి. బడ్జెట్ లేకపోవడంతో నిర్మాణాలు ఆగాయి. వారికి దారి లేకుండా చేస్తున్నారన్నదే మా ఆవేదన” అని దానం నాగేందర్ అన్నారు.

కాగా, అక్రమ నిర్మాణాలపై చట్టపరంగానే ముందుకెళ్తున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తేల్చి చెప్పారు. తమకు ఎవరిపైన ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవన్నారు. ”నందగిరి హిల్స్ సొసైటీ వాళ్లతో మేము కుమ్మక్కు అవ్వలేదు. మేము అలాంటి పనులు చేయము. ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే మా కర్తవ్యం. అది సొసైటీది కాదు బస్తీ వాళ్లది కాదు. ప్రభుత్వ ఆస్తి. దాన్ని కాపాడేందుకే మేమున్నాం” అని ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.

Also Read : ప్రభుత్వం ఇచ్చే జీతం సరిపోలేదా? లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన అడిషనల్ కలెక్టర్