మోడీ హైదరాబాద్ టూర్:‌ కేసీఆర్ అక్కర్లేదు… పీఎంవో ఆదేశాలు

  • Published By: venkaiahnaidu ,Published On : November 28, 2020 / 04:20 AM IST
మోడీ హైదరాబాద్ టూర్:‌ కేసీఆర్ అక్కర్లేదు… పీఎంవో ఆదేశాలు

Updated On : November 28, 2020 / 7:47 AM IST

Modi’s Visit to Hyderabad, Protocol differs ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పీఎంవో కార్యాలయం కొత్త నిబంధనలు జారీ చేసింది. శనివారం(నవంబర్-28,2020) మోడీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా హకీంపేట ఎయిర్‌పోర్టులో ఆయనకు స్వాగతం తెలపడానికి కేవలం ఐదుగురు అధికారులకు మాత్రమే ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అనుమతించింది



ప్రధానికి స్వాగతం చేప్పడానికి హకీంపేట ఎయిర్‌ ఆఫీస్‌ కమాం డెంట్, సీఎస్‌ సోమేశ్‌ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్‌ శ్వేతా మొహంతి, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మాత్రమే రావాలని పీఎంవో ఆదేశాలు పంపింది.



శనివారం మధ్యాహ్నం హకీంపేట విమానాశ్రయానికి చేరుకొనే ప్రధానికి సీఎం కేసీఆర్‌ స్వాగతం పలుకుతారని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పీఎంవోకు సమాచారమిచ్చింది. అయితే ప్రధానికి స్వాగతం పలకడానికి సీఎం రావాల్సిన అవసరం లేదని ప్రధాని వ్యక్తిగత సహాయకుడు వివేక్‌…తెలంగాణ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు ఫోన్ లో తెలిపినట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.



సాధారణంగా ప్రధాని అధికారిక పర్యటనల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి,గవర్నర్లు స్వాగతం పలకడం పరిపాటి. ప్రధాని హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో సీఎం కేసీఆర్ వచ్చి స్వాగతం పలుకుతారని సీఎంవో కార్యాలయం పీఎంవో కార్యాలయానికి సమాచారం ఇచ్చింది. అయితే గత సంప్రాదాయాలకు తిలోదకాలిచ్చేలా… సీఎం రావాల్సిన అవసరం లేదని పీఎంవో కార్యాలయం నుంచి సమాచారం రావడం చర్చనీయాంశంగా మారింది.



కాగా, ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకి ప్రధాని హైదరాబాద్ చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో హకీంపేటకు చేరుకుని అక్కడ్నుంచి భారత్ బయోటెక్ సంస్థకు చేరుకుంటారు. కరోనా వాక్సిన్ “కోవాగ్జిన్” తయారీ, పనితీరుపై క్షేత్రస్థాయిలో సమీక్షించనున్నారు. శాస్త్రవేత్తలతో మాట్లాడనున్నారు.



మధ్యాహ్నం 3గంటలకు హకీంపేట నుంచి ఆయన పుణె వెళ్లనున్నారు. అక్కడ సీరం ఇనిస్టిట్యూట్‌ను సందర్శిస్తారు. హైద‌రాబాద్‌కు రావ‌డానికి ముందు ప్ర‌ధాని మోదీ.. తొలుత అహ్మ‌దాబాద్ వెళ్తారు. అక్క‌డ జైడ‌స్ కాడిలా ప్లాంట్‌ను సందర్శిస్తారు.చంగోదార్ పారిశ్రామిక వాడ‌లో ఉన్న ప్లాంట్‌కు వెళ్లి టీకాకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుంటారు