ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య స్కూల్ గొడవ.. అధికారుల మల్లగుల్లాలు..

పొలిటికల్‌ పోట్లాటలు పెట్టుకుని రచ్చ చేయడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీస్తున్నారు.

ఇద్దరు ప్రజాప్రతినిధుల మధ్య స్కూల్ గొడవ.. అధికారుల మల్లగుల్లాలు..

Updated On : March 19, 2025 / 8:22 PM IST

నేనంటే నేను.. నేను చెప్పిందే జరగాలి.. ఇదీ ఎంపీ, ఎమ్మెల్యే మధ్య జరుగుతున్న రచ్చ. నవోదయ స్కూల్ ఇష్యూ.. ఇద్దరి మధ్య చిచ్చు రాజేసింది. కేంద్రం మంజూరు చేసింది కాబట్టి తాను చెప్పిన చోటే ఏర్పాటు చేయాలని ఎంపీ.. లేదు లేదు తాను చెప్పిన చోట నిర్మిస్తేనే బెటర్ అంటూ ఎమ్మెల్యే.. ఎవరికి వారు తగ్గేదే అంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక.. ఎక్కడ స్కూల్‌ పెట్టాలో అర్థం కాక అధికారులు దిక్కులు చూస్తున్నారట. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వార్‌.. తెలంగాణలో కొత్త రాజకీయ రచ్చకు కారణం అవుతోంది. ఈ పంచాయితీ ఏంటి.. ఎక్కడ జరుగుతోంది.

నిజామాబాద్‌ జిల్లాలకు నవోదయ విద్యాలయాన్ని కేంద్రం మంజూరు చేసింది. ఐతే దాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై.. రాజకీయ రాద్ధాంతం మొదలైంది. కేంద్రం మంజూరు చేసిన స్కూల్‌ కావడంతో… తాను సూచించిన ప్రాంతంలో ప్రారంభించాలని ఎంపీ అరవింద్ పట్టుపడుతున్నారు. జక్రాన్‌పల్లి మండలం కలిగోట్‌లో స్కూల్ ఏర్పాటు చేయాలని.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.

ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల బృందం.. కలిగోట్‌లో ఆ స్థలాన్ని పరిశీలించింది. ఈ ప్రాంతం.. నిజామాబాద్‌ రూరల్ నియోజకవర్గం కిందకు వస్తుంది. ఇక్కడ నవోదయ స్కూల్‌ ఏర్పాటు దాదాపుగా ఖాయమని అనుకుంటున్న టైమ్‌లో.. సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. అరవింద్ సూచించిన స్థలంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య పొలిటికల్ ఫైట్ షురూ అయింది.

కలిగోట్‌లో స్కూల్‌ ఏర్పాటు చేయాలని ఎంపీ అరవింద్ పట్టుపడుతుంటే.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాత్రం ఆచన్‌పల్లిలోని నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ స్ధలంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు. ఇద్దరి మధ్య యుద్ధంతో.. అసలు స్కూల్ ఎక్కడ ఏర్పాటు చేయాలో తెలియక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారట. అటు ఎంపి మాట కాదనలేక… ఇటు ఎమ్మెల్యే మాటకు సమాధానం చెప్పలేక నలిగిపోతున్నారట పాపం ! ఐతే స్కూల్‌ వ్యవహారం.. పొలిటికల్‌ వార్‌కు కారణం అవుతోంది.

బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ రచ్చ
నవోదయ స్కూల్‌ను బోధన్‌ తరలించుకుపోయే ప్లాన్‌లో సుదర్శన్‌ రెడ్డి ఉన్నారంటూ అరవింద్ టార్గెట్‌ చేస్తున్నారు. ఇక బీజేపీ శ్రేణులు ఓ అడుగు ముందుకేసి.. సుదర్శన్‌ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో వివాదం కాస్త.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ రచ్చకు దారి తీసింది.

అసలు నిజాం షుగర్స్‌ భూముల్లో నవోదయ స్కూల్‌ ఏర్పాటు సాధ్యం కాదని.. మంత్రి పదవి కోసం పిల్లల భవిష్యత్‌తో ఆడుకోవద్దు అంటూ సుదర్శన్‌ రెడ్డి టార్గెట్‌గా ఎంపీ అరవింద్‌ విమర్శలు సంధిస్తున్నారు. దీంతో రాజకీయం మరింత రగులుతోంది. ఇక సుదర్శన్‌ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తుంటే.. కాంగ్రెస్‌ కూడా తగ్గేదే లే అంటోంది.

అరవింద్‌కు వ్యతిరేకంగా నిరసనలకు రెడీ అవుతోందని టాక్‌. ఇక అటు ఈ వ్యవహారం.. కాంగ్రెస్‌లోనూ ప్రకంపనలు క్రియేట్‌ చేస్తుందనే చర్చ జరుగుతోంది. సీనియర్ నేత సుదర్శన్‌ రెడ్డిని బీజేపీ టార్గెట్ చేస్తున్నా.. స్థానిక నేతలు మౌనం దాల్చడంపై పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ నేతలు.. కౌంటర్‌ ఎటాక్‌కు సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

నిజామాబాద్ జిల్లాలో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలన్నది జిల్లావాసుల దశాబ్దాల డిమాండ్‌. అలాంటిది.. దాన్ని నెరవేరుస్తూ కేంద్రం నవోదయ స్కూల్‌ మంజూరు చేస్తే.. పొలిటికల్‌ పోట్లాటలు పెట్టుకుని రచ్చ చేయడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. ఐతే స్కూల్‌ స్థలం విషయంలో మొదలైన రచ్చ.. రాజకీయాన్ని మరింత మండిస్తోంది. మరి ఈ మంటలు ఎన్నాళ్లు ఉంటాయ్‌.. ఏ మలుపు తీసుకుంటాయన్నది మరింత ఆసక్తి రేపుతోంది.