Ruby Hotel Fire Accident : సికింద్రాబాద్ రూబీ హోటల్ అగ్నిప్రమాదం కేసులో కొత్త కోణం.. వెలుగులోకి షాకింగ్ నిజం
సికింద్రాబాద్ రూబీ ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రూబీ ఎలక్ట్రిక్ బైక్స్ యజమానికి ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం ఉందని బయటపడింది.

Ruby Hotel Fire Accident : సికింద్రాబాద్ రూబీ ఎలక్ట్రిక్ బైక్ షో రూమ్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రూబీ ఎలక్ట్రిక్ బైక్స్ యజమానికి ప్రైవేట్ ఫైనాన్స్ వ్యాపారం ఉందని బయటపడింది. టూ వీలర్లను తనఖా పెట్టుకుని వడ్డీకి అప్పులు ఇస్తాడని పోలీసుల విచారణలో తేలింది. మంటలు అంటుకున్న సమయంలో సెల్లార్ లో కొన్ని పెట్రోల్ బైక్స్ కూడా ఉన్నాయని గుర్తించారు పోలీసులు. ఇక ప్రమాదంలో ఎలక్ట్రిక్ బైక్స్ తో పాటు పెట్రోల్ బైక్స్ కూడా కాలి బూడదయ్యాయి. పెట్రోల్ బైక్స్ ఎక్కడివి అని పోలీసులు ఆరా తీయగా వడ్డీ వ్యాపారం సంగతి బయటపడింది.
సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో రూబీ లగ్జరీ ప్రైడ్ పేరుతో ఉన్న ఐదంతస్తుల భవనంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. భవనంలోని సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్లలో రూబీ ఎలక్ట్రిక్ వాహనాల షోరూం నడుస్తోంది. మిగిలిన నాలుగు అంతస్తుల్లో హోటల్ నిర్వహిస్తున్నారు.
బైక్ బ్యాటరీ పేలడంతో ముందుగా సెల్లార్ లో మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఈ-స్కూటర్లు ఒక్కొక్కటిగా వరుసపెట్టి పేలడంతో.. ఆ ప్రాంతంలో భారీ శబ్దాలు వచ్చాయి. చూస్తుండగానే దట్టమైన పొగ, మంటలు.. షోరూం పైన ఉన్న రూబీ హోటల్‌కు వ్యాపించాయి. హోటల్‌లో దిగిన పలువురు పొగలకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే కొందరు సజీవ దహనం అయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొందరు ప్రాణభయంతో పైనుంచి కిందకు దూకారు. తీవ్రగాయాలపాలై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రమాదానికి కారణమైన ఎలక్ట్రిక్ వాహనాల షోరూం నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఓనర్ బగ్గా రంజిత్‌తో పాటు మరొకరిపై కేసు నమోదు చేశారు. నిజానికి సెల్లార్‌లో ఎలాంటి వాణిజ్య వ్యాపారాలు చేయకూడదు. కానీ యాజమాని అందుకు విరుద్దంగా వ్యవహరించాడు. భవన యజమానిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు హోంమంత్రి మహమూద్ అలీ.