New Year Celebrations
New Year Celebrations : మరో ఏడాది కాలగమనంలో కలిసిపోతోంది.. కోటి ఆశలతో కొత్త ఏడాది 2026కు స్వాగతం పలికేందుకు హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. న్యూఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు హైదరాబాద్ నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే, డిసెంబర్ 31వ తేదీన న్యూఇయర్ వేడుకలవేళ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సైతం సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో న్యూఇయర్ వేడుకల వేళ సైబరాబాద్ పోలీసుల కీలక ఆంక్షలు విధించారు.
నూతన సంవత్సరం సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1వ తేదీ ఉదయం వరకు ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉంటాయని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. రాత్రి 10:30 గంటల నుంచి 2:00 గంటల వరకు C&D వాహనాలపై నిషేధం విధించారు. ORR పరిధిలో సైబరాబాద్ కమిషనరేట్ హద్దుల్లోకి అనుమతి లేదు.
న్యూ ఇయర్ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ట్రాఫిక్ నిబంధనలు విధించారు. డిసెంబర్ 31న ప్రజల భద్రతకోసం ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. క్యాబ్, టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫాం, డాక్యుమెంట్లు కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
ప్రయాణికులను తిరస్కరించిన డ్రైవర్లపై ఈ-చలాన్ ద్వారా జరిమానా విధించనున్నారు. అధిక ఛార్జీలు, అసభ్య ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి డ్రైవింగ్‌కు అనుమతిస్తే బార్, పబ్, క్లబ్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేయనున్నారు. డ్రంక్ డ్రైవింగ్ నివారణకు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు తప్పనిసరి సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు.
రాత్రి 8 గంటల నుంచి సైబరాబాద్ అంతటా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని, స్పెషల్ కెమెరాలతో రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్ గుర్తింపు ఉంటుందని చెప్పారు. హెల్మెట్ లేకుండా రైడింగ్, రాంగ్ పార్కింగ్‌పై చర్యలు తప్పవని హెచ్చరించారు. డాక్యుమెంట్లు చూపించకపోతే వాహనాల తాత్కాలిక స్వాధీనం చేసుకోవటం జరుగుతుందని, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనాల సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.
నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. అధిక శబ్దం చేసే మ్యూజిక్ సిస్టమ్‌లపై నిషేధం విధించారు. ట్రిపుల్ రైడింగ్, ప్రమాదకర డ్రైవింగ్‌పై కేసులు నమోదు చేస్తామని అన్నారు. డ్రంక్ డ్రైవింగ్‌కు రూ.10,000 జరిమానా లేదా జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. పునరావృత తప్పిదాలకు లైసెన్స్ శాశ్వత రద్దు చేస్తామని, ప్రజలు జాగ్రత్తగా ప్రయాణించి నూతన సంవత్సరాన్ని సురక్షితంగా జరుపుకోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ అవినాష్ మహంతీ సూచించారు.