Bride Dead
Newlyweds died : కులాలు వేరు…ప్రాంతాలు వేరు అయినా వారిద్దరూ ఒకే శ్వాసగా బతకాలనుకున్నారు. ఆ ప్రేమ జంట ఇరు కుటుంబాలను ఒప్పించారు. బంధు మిత్రుల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. దాంపత్య జీవితం హాయిగా గడుస్తుందనుకున్నారు. కానీ ఆ పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. కాళ్ళ పారాణి ఆరకముందే, ద్వారాలకు కట్టిన తోరణాలు వాడిపోక ముందే నవ వధువు అనంత లోకాలకు వెళ్ళిపోయింది. హైబీపీ రూపంలో బ్రెయిన్‌డెడ్ ఆస్పత్రిలో చేరిన ఆమెను మృత్యువు కబళించింది. ఈ ఘటన ఆ రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది.
మెదక్‌కు చెందిన మెడికల్ స్టోర్స్ యజమాని ప్రభాకర్ కుమారుడు రాఘవేంద్ర, ఏపీలోని పార్వతీపురం ప్రాంతానికి చెందిన కోటేశ్వరరావు కుమార్తె ఉష ప్రేమించుకున్నారు. ఇరువురు తల్లిదండ్రులను ఒప్పించారు. ఈనెల 11న అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ఎంతో ఆనందంగా ఉన్న ఉషకు తల నొప్పి రావడంతో, మెదక్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ కు తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఉషా హైబీపీతో బ్రెయిన్‌డెడ్ అయ్యింది. ఆరోగ్యం క్షీణించిందని ఆమె బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చి చెప్పారు.
Bride Died : పెళ్లింట విషాదం.. రిసెప్షన్ జరుగుతుండగానే నవ వధువు మృతి
పుట్టెడు దుఃఖంలో కూడా సామాజిక బాధ్యతను విస్మరించని ఆ కుటుంబం అవయవదానానికి ముందుకొచ్చింది. కానీ అక్కడా వారికి చేదు వార్తే చెవిలో పడింది. బ్రెయిన్ స్ట్రోక్ సందర్భంలో శరీరంలో విపరీతమైన వాటర్ రావడంతో, ఆ అవయవదానానికి అవకాశం లేకుండా పోయింది. మృత్యువుతో పోరాడి ఓడింది ఉష. పెళ్లైన కొన్ని రోజులకే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.