Cm Revanth Reddy: కృష్ణా, గోదావరి బేసిన్లలో తెలంగాణ నీటి వివాదాలపై ప్రజా భవన్ లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టులు, నీటి వాటాల విషయంలో బీఆర్ఎస్ పై ఆయన ఫైర్ అయ్యారు. కేసీఆర్, హరీశ్ రావు టార్గెట్ గా నిప్పులు చెరిగారు. ప్రాజెక్టులు, నీటి వాటాల విషయంలో నాడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే నేడు తెలంగాణకు శాపంగా మారాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. నీళ్ల విషయంలో బీఆర్ఎస్ కారణంగా తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ పై కేసీఆర్, హరీశ్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
నీళ్లకు నాగరికతకు ఎంత సంబంధం ఉందో.. నీళ్లకు తెలంగాణ ప్రజలకు అంతే సంబంధం ఉందని చెప్పారు. మిగతా విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా.. నీళ్ల విషయంలో తెలంగాణ ప్రజలందరికీ ఏకాభిప్రాయం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో కేసీఆర్, హరీశ్ సాగునీటి మంత్రులుగా ఉన్నారని.. నిర్లక్ష్యమో, అహంకారమో తెలియదు కానీ… వారు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు గుదిబండగా మారాయని సీఎం రేవంత్ మండిపడ్డారు.
రాష్ట్ర విభజన సందర్భంలో నీళ్ల విషయంలో వివాదాలు తలెత్తుతాయని మన్మోహన్ సింగ్ రివర్ మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చేశారని సీఎం రేవంత్ తెలిపారు. 2015 జూన్ 18న జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రాంతానికి మరణశాసనం రాసి నీటి కేటాయింపులపై కేసీఆర్, హరీశ్ సంతకాలు పెట్టి వచ్చారని ఆరోపించారు. కల్వకుర్తి, పాలమూరు, ఎస్ఎల్ బీసీ, బీమా, నెట్టెంపాడు వంటి నిర్మాణాలను ఆనాటి ప్రభుత్వం పూర్తి చేయలేదని, దీంతో 299 టీఎంసీలను వాడుకోలేకపోయామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
”ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్లే ఆ నీటిని తెలంగాణ వాడుకోలేకపోయింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేయలేదు. కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతుల పట్ల కేసీఆర్, హరీశ్ మరణశాసనం రాశారు. గోదావరి బేసిన్ లో 1486 టీఎంసీలు ఉంటే 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఆంధ్రాకు కేటాయించారు. తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ తన ధన దాహంతో రీ ఇంజనీరింగ్ పేరుతో ఊరు పేరు అంచనాలు మార్చారు. లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టుతో 50వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు.
బనకచర్లపై కేసీఆర్, హరీశ్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఇలా అబద్ధాలు చెప్పడం వల్లే ఆ పార్టీ అధికారం కోల్పోయింది. ఎంపీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఇప్పుడు అభ్యర్థులే దొరకని పరిస్థితి. ఇది నదుల పునరుజ్జీవనం కోసం కాదు బీఆర్ఎస్ పునరుజ్జీవనం కోసం వారు మాట్లాడుతున్నారు.
అందుకే కేసీఆర్ అండ్ కో.. బనకచర్లను ఒక భూతంగా చిత్రీకరించాలని క్షుద్ర రాజకీయాలు, కుట్రలు చేస్తోంది. 3వేల టీఎంసీల వరద జలాలు ఉన్నాయని కేసీఆర్ కు ఏ దేవుడు చెప్పాడో కానీ.. చంద్రబాబు దీన్ని అదనుగా తీసుకున్నారు. అసలు ఈ రాచపుండు సృష్టించిందే కేసీఆర్. చంద్రబాబు ప్రపోజల్ కు కొనసాగింపుగా ఇదే ప్రజా భవన్ లో జగన్ కు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి కేసీఆర్ గోదావరి జలాలు తీసుకుపొమ్మన్నారు. మా ఇంటికొస్తే ఏం తెస్తావ్.. మీ ఇంటికొస్తే ఏం ఇస్తావ్ అనే విధానంతో వారు ముందుకెళ్లారు.
Also Read: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్.. 2లక్షలకు పైగా కొత్త కార్డులు.. ఎప్పుడు ఇస్తారంటే..
గోదావరి బేసిన్ లో తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తైన తరువాతే మిగులు జలాల లెక్క తేలుతుంది. మిగులు, వరద జలాల లెక్క తేలాలంటే ఇరు రాష్ట్రాలు చర్చించుకోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి, నాకు రాయలసీమ రొయ్యల పులుసుతో పని లేదు. తెలంగాణ ప్రజల హక్కులతోనే పని. ఇందుకోసం న్యాయమైన విధానంతో ఎక్కడైనా కొట్లాడేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కృష్ణా బేసిన్ లో మేం కట్టుకునే ప్రాజక్టులకు ఏపీ అభ్యంతరాలు చెబుతోంది. నికర జలాల కేటాయింపు ఉన్న తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరాలు ఎందుకు? మీరు కూడా ముందుకొచ్చి సహకరించాలి కదా ఏపీ సీఎం. ఇది ఒకవైపు నుంచి వెళితే సమస్య పరిష్కారం కాదు. చర్చలతోనే పరిష్కారమవుతుంది.
పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం లిటిగేషన్లు పెడుతోంది. ఇన్ని మాటలు మాట్లాడుతున్న కిషన్ రెడ్డి ఎందుకు ఈ విషయంలో బాధ్యత తీసుకోరు? ఈ వివాదాన్ని పెంచి బీఆర్ఎస్ పార్టీని బతికించుకుని రాజకీయ లబ్ది పొందాలనుకుంటోంది. వాళ్ల ఆరాటం నీటి కేటాయింపుల కోసం కాదు. ఇదొక రాజకీయ వ్యూహం. వ్యూహాత్మక ఎత్తుగడలతో అంతరించిపోతున్న బీఆర్ఎస్ ను పునరుజ్జీవింపజేసేందుకు వీళ్ల ఆరాటం. తద్వారా బీఆర్ఎస్ ను బతికించి రాజకీయ లబ్ది పొందాలన్నదే బీజేపీ వ్యూహం. దీనిపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరించాలి.
ప్రజలకు నిజాలు చెప్పకపోతే అబద్ధాలే నిజమనుకుంటారు. హరీశ్ రెండు రోజులు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెడదాం. ఒకరోజు కృష్ణా బేసిన్ పై, ఇంకో రోజు గోదావరి బేసిన్ పై చర్చ పెడదాం. స్పీకర్ ఫార్మాట్ లో స్పీకర్ కు లేఖ రాయండి. ఈ రాచపుండును తెలంగాణ ప్రజలకు అంటగట్టింది ఎవరో తేలాల్సిన అవసరం ఉంది. మన శాశ్వతమైన నీటి హక్కులను సాధించుకునేందుకు స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలి. కెసీఆర్ తో పంచాయితీ కాదు. మన హక్కులను ఎలా సాధించుకోవాలో తెలిపేందుకే ఈ సమావేశం. మన ఫోకస్ అంతా కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై పెట్టాలి.
బీజేపీ పరోక్షంగా బీఆర్ఎస్ ను బతికించేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందుకు కిషన్ రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారు. కిషన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఆఫీస్ నుంచే వస్తుంది. కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తోంది. తెలంగాణ ప్రజల అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపై ఉంది. రాష్ట్రాల హక్కులను కాల రాయడానికి బీజేపీకి 8 మంది ఎంపీలను ఇవ్వలేదు. బీజేపీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావుకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ ముందున్న మొట్టమొదటి సమస్య గోదావరి నదీ జలాల సమస్య. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మొట్టమొదటి కార్యాచరణ తీసుకుని ప్రధాని దృష్టికి తీసుకెళ్లండి. ఇందుకు కావాల్సిన సమాచారం మా మంత్రులు అధికారులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.