నో మాస్క్ ..నో ఓటు : జీహెచ్ఎంసీ ఎన్నికలు..కొత్త నిబంధనలు

  • Publish Date - October 28, 2020 / 07:23 AM IST

GHMC elections..new rules : కరోనా నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త నిబంధనలను అమలు చేయబోతుంది. త్వరలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఆ నిబంధనలను ఖచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటోంది. నో మాస్క్‌.. నో వోట్‌..అంటూ..కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకురాబోతుంది. ఎన్నికలు అంటే మామూలు కోలాహలం ఉండదు.



ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర్నుంచి, నామినేషన్, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు పార్టీలన్నీ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు..ప్రచార పర్వానికి తెర తీస్తాయి. కానీ ప్రస్తుత కరోనా పరిస్థితులతో అన్నీ తలకిందులయ్యాయి. కరోనా లాక్‌డౌన్ నుంచి కరోనా ఆన్‌లాక్ కూడా పూర్తైంది. కానీ ఇంకా కరోనా మహమ్మారి నీడలు మాత్రం ప్రజలను వెంటాడుతునే ఉన్నాయి.



ఈ సమయంలో అంటే డిసెంబరు లేదా జనవరిలో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే ఓటర్ల ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం కఠిన నిబంధనలు అమలు చేయబోతుంది. ఓటు వేసే వారు విధిగా మాస్కును ధరించేలా..మాస్కు లేకపోతే పోలింగ్‌ కేంద్రంలోనికి అనుమతి నిరాకరించేలా..కొత్త నిబంధన అమల్లోకి తీసుకురాబోతుంది.



కొత్త నిబంధనల ప్రకారం…ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒక్కరు ముఖానికి మాస్కు ధరించాల్సి ఉంటుంది. పోలింగ్‌ అధికారి సిబ్బంది విధిగా మాస్కు, శానిటైజర్‌, ఫేస్‌ షీల్డ్‌ కలిగి ఉండాలి. అత్యవసరమైతే పీపీఈ కిట్లు ధరించేలా..నామినేషన్‌ దాఖలుకు అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని అనుమతి ఇచ్చేలా కరోనా నిబంధనలను తయారు చేశారు. నామినేషన్లు దాఖలు చేసే కార్యాలయ ఆవరణ వద్దకు రెండు వాహనాలనే అనుమతిస్తారు.



ఎన్నికల సామాగ్రిని భద్రపర్చడం, పంపిణీ చేయడం వంటి చోట్ల కూడా కఠిన నిబంధనలు పాటించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నారు. ఓ వైపు రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నా..భవిష్యత్‌లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశమున్నట్లు చెబుతుండటంతో..తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.



అలాగే…ఎన్నికల ప్రచారం, పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచించింది. పోలింగ్‌ జరగడానికి ఒక రోజు ముందుగానే పోలింగ్‌ కేంద్రాలు శానిటైజ్‌ చేయడం..ఓటర్లు భౌతిక దూరం క్యూ పద్ధతి పాటించేలా పోలింగ్‌ కేంద్రాల వద్ద మార్కింగ్‌ చేయాల్సి ఉంటుంది.



ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్‌ అధికారులతో పాటు ఓటర్లు కూడా మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేయబోతున్నారు. ఇటీవల భారత ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన మార్గదర్శకాలను గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో విధిగా పాటించాలని సంబంధిత అధికారులు, ఎన్నికల అధికారులు సిబ్బందిని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. మరికొద్ది రోజుల్లో జరిగే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఈ నిబంధనలు పక్కాగా అమలు చేయబోతున్నారు.