పాతబస్తీ గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనకు కారణం ఇదే.. నివేదిక సిద్ధం చేసిన అధికారులు
పాతబస్తీలోని చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద ఉన్న భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంకు కారణాలపై అధికారులు ఓ నిర్దారణకు వచ్చారు.

Gulzar House fire incident
Gulzar House Fire Accident: పాతబస్తీలోని చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద ఉన్న భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం 17మంది ఆయువు తీసింది. ఈ అగ్నిప్రమాద ఘటనపై నివేదిక సిద్ధమైంది. ఇన్వర్టర్ లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే భవనంలో ప్రమాదం చోటు చేసుకుందని అగ్నిమాపక శాఖ అధికారులు నిర్ధారణకు వచ్చారు.
అగ్నిమాపక శాఖ దర్యాప్తులో ఇన్వర్టర్ లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. బుధవారం నాగ్‌పూర్ ఫోరెన్సిక్ నివేదికలోనూ అదే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో రెగ్యులర్ కరెంటును ఆఫ్ చేసి ఉన్నట్లు గుర్తించారు. ఇన్వర్టర్ ద్వారా సెకండరీ పవర్ సప్లయ్ మాత్రమే ఉన్నట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. ఇన్వర్టర్ లో ఓవర్ లోడ్ కారణంగానే షార్ట్ సర్క్యూట్ అయింది. హైదరాబాద్ కు చెందిన నిపుణులతో పాటు సీనియర్ కన్సల్టెంట్ నిర్దారించారు. నాగపూర్ నుంచి సైతం వచ్చిన ఫైర్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఇప్పటికే తమ రిపోర్టును అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డికి అందజేసింది.
మరోవైపు అగ్నిప్రమాదంలో ఎక్కువ మంది పొగ ఎక్కువ రావడంతోనే మరణించినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు బయటికి రాకుండా రూమ్ లోనే ఉండి తలుపులు వేసుకున్నారు. దీంతో పొగను పీల్చి ఊపిరి ఆడకుండా పడిపోయినట్లు గుర్తించారు. ఈ కారణంగా ఊపిరాడక చనిపోయినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. త్వరలో ఘటన స్థలానికి ఓఎన్జీసీ కంపెనీ బృందాలు ఘటన స్థలంలో పర్యవేక్షించనున్నాయి.