Pension Hike : ఇక నుంచి పెన్షన్ రూ.4016 కు పెంపు.. సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్
Pension Hike : దేశంలో తలసరి ఆదాయంలో, విద్యుత్ వినియోగం, తాగునీటి సౌకర్యంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని చెప్పారు.

CM KCR (Photo : Google)
Pension Hike – CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ దివ్యాంగులకు శుభవార్త చెప్పారు. వారికి ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని పెంచారు. ఇక నుంచి రాష్ట్రంలోని దివ్యాంగులకు రూ.4016 పింఛన్ ఇస్తామన్నారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ కు మరో వెయ్యి రూపాయలు పెంచారు. పెరిగిన పింఛన్ వచ్చే నెల నుంచే అమల్లోకి వస్తుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా ప్రగతి నివేదన సభలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు.
మంచిర్యాల జిల్లా కోసం ఎన్నో పోరాటాలు చేశారు, కానీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని కేసీఆర్ అన్నారు. దేశంలో తలసరి ఆదాయంలో, విద్యుత్ వినియోగం, తాగునీటి సౌకర్యంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని చెప్పారు. దేశంలో 94 లక్షల ఎకరాల్లో వరి సాగు అయితే తెలంగాణలోనే 56 లక్షల ఎకరాల్లో పండిందన్నారు.
”కేంద్రం దుర్మార్గం వల్ల పామాయిల్ ఉత్పత్తిలో వెనుకబడ్డాం. కుల వృత్తులకు లక్ష ఆర్థిక సాయం, సొంత జాగా ఉన్నవాళ్లకు రూ.3 లక్షలు ఇచ్చే గృహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించాం. గతంలో గోదావరిలో నీళ్లు ఉండేవి కావు. ఇప్పుడు సజీవ గోదావరి కనబడుతుంటే కళ్ల నుండి ఆనందబాష్పాలు వస్తున్నాయి. వార్దా నదిపై త్వరలోనే బ్యారేజ్ నిర్మిస్తాం. లక్ష ఎకరాల సాగులోకి రాబోతుంది.
134 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి మన ఆస్తి. సింగరేణిని కాంగ్రెస్ సర్వనాశనం చేసింది. సింగరేణి చేసిన అప్పు తీర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం.. 49 శాతం వాటాను కేంద్రానికి అప్పజెప్పింది. 11 వేల కోట్ల సింగరేణి టర్నోవర్ ను 33 వేల కోట్లకు పెంచుకున్నాం. సింగరేణి లాభాలు రూ.2184 కోట్లు. దసరాకు సింగరేణి కార్మికులకు 700 కోట్ల బోనస్ ఇవ్వబోతున్నాం.
బీజేపీ సర్కార్ బొగ్గు గనులను ప్రైవేట్ కి ఇచ్చి తాళం వేయిద్దామని చూస్తోంది. దేశంలో బొగ్గుకి కొరత లేదు. 361 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. సింగరేణిని మరింత విస్తరిస్తాం. ఎంతో బొగ్గు ఉన్నా.. విదేశాల నుండి బొగ్గు దిగుమతి చేస్తున్నారు. సింగరేణిని కాంగ్రెస్ సగం ముంచితే.. బీజేపీ నిండా ముంచాలని చూస్తోంది. దేశంలోని బొగ్గు నిల్వలతో ప్రతి గ్రామానికి, పరిశ్రమకు 150 ఏళ్లు కరెంటు ఇవ్వొచ్చు.
రైతుల భూములు ఆగం కావొద్దని ధరణి ప్రవేశపెట్టాం. ధరణి పోతే దళారుల రాజ్యం వస్తుంది. ధరణిని తీసేస్తా అన్న వాళ్ళని బంగాళాఖాతంలో కలపండి. వికలాంగుల పెన్షన్ మరో వెయ్యి రూపాయలు పెంచుతూ.. వచ్చే నెల నుండి రూ.4016 ఇస్తాం” అని సీఎం కేసీఆర్ చెప్పారు.