పొలిటికల్ వారసులు

  • Published By: chvmurthy ,Published On : March 30, 2019 / 02:42 PM IST
పొలిటికల్ వారసులు

Updated On : March 30, 2019 / 2:42 PM IST

ఏ ఫీల్డ్ అయినా వారసులు కామన్. సినీ రంగం, రాజకీయం ఎక్కడ చూసినా పిల్లలను రంగంలోకి దింపేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఎన్నికల నాటికి తమ వాళ్లను తెరపైకి తెచ్చి  టికెట్ సాధించుకుంటారు. ఇలా ప్రతీ ఎన్నికల్లోనూ వారసత్వం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ సీన్ అంతంత మాత్రంగానే కనిపించింది. 
 
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది నానుడి. ఈ సామెతను చాలామందిన నేతలు ఫాలో అవుతున్నారు. సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న నేతలు తాము తప్పుకోవాలని భావించే సమయానికి కుమారులను, కుమార్తెలను రంగంలోకి దింపేస్తున్నారు. తమ మాట చెల్లుబాటు అవుతున్న సమయంలోనే వారసులను తెరపైకి తీసుకొచ్చి వారి రాజకీయ జీవితానికి గట్టి పునాది వేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయించి చట్ట సభలకు పంపిస్తున్నారు. 

అయితే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం తెలంగాణలో వారసుల హవా అంతగా కనిపించడం లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల వారసులు అరంగేట్రం చేద్దామని ట్రై చేసినా  ప్రధాన పార్టీలు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదనే చెప్పుకోవాలి. టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఇద్దరు కీలక నేతల పిల్లలు పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకున్నా ఇద్దరికీ అవకాశాలు దక్కలేదు. టీఆర్ఎస్ ప్రకటించిన 17మంది అభ్యర్థుల్లో వారసుడిగా టికెట్ దక్కించుకున్నది మాత్రం ఒక్కరే. మరికొందరు వారసులు ఉన్నా గతంలో పోటీ చేసిన అనుభవం ఉంది. నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్న కవిత కేసీఆర్ తనయే అయినా అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. రెడ్యానాయక్ కుమార్తెగా అందరికీ పరిచయమైన మాలోత్ కవిత మహబూబాబాద్ బరిలో ఉన్నారు. అయితే గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉంది. మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు ఒక్కరే ఈ ఎన్నికల ద్వారా రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. 

టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించినా కొందరికి దక్కలేదు. గతంలోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సబిత తనయుడు కార్తిక్ అటు కాంగ్రెస్ నుంచి ఇటు గులాబీ పార్టీ నుంచి టికెట్ దక్కించుకోలేకపోయారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు భాస్కర్‌రెడ్డి  జహీరాబాద్ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కేంద్ర మాజీమంత్రి వెంకటస్వామి కూమారులిద్దరూ చాలా ఏళ్ళుగా రాజకీయాల్లోనే ఉన్నా ఈసారి మాత్రం మొండిచేయి ఎదురైంది. అయితే మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి తొలిసారిగా పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. 

కాంగ్రెస్‌ నుంచి చాలా మంది వారసులు అరంగేట్రం కోసం ఉవ్విళ్లూరినా హై కమాండ్ నిర్ణయాలతో వారికి టికెట్ దక్కకుండా పోయాయి. సీనియర్ నేత జానారెడ్డి తనయుడు రఘువీర్ పార్లమెంట్ బరిలో ఉంటారని భావించినా అది సాధ్యం కాలేదు. మరో జాతీయ పార్టీ బీజేపీలో మాత్రం సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ తనయ బంగారు శృతి ఒక్కరే నాగర్‌‍కర్నూల్ టికెట్ దక్కించుకున్నారు. లక్ష్మణ్ వారసురాలిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

మొత్తంగా చూస్తే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఇద్దరు వారసులకు మాత్రమే కొత్తగా అవకాశం దక్కింది. మరి వాళ్లిద్దరూ ఆ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.