Pregnant Woman Suicide : పాపం సుస్మిత.. పుట్టబోయే బిడ్డకు డీఎన్ఏ టెస్ట్ కోరిన భర్త.. గర్భిణి ఆత్మహత్య
Pregnant Woman Suicide : మెదక్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఐదు నెలల గర్భిణీ ఆత్మహత్య చేసుకుంది.
pregnant woman suicide after husband demanded dna test in medak
Pregnant Woman Suicide : మెదక్ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గర్భంలో ఉన్న శిశువుకు డీఎన్ఏ పరీక్ష చేయాలని భర్త పట్టుబట్టడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఐదు నెలల గర్భిణీ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి భర్తతోపాటు, అతని తల్లిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చగా.. కోర్టు వారిని జ్యుడీషియల్ రిమాండ్ కు పంపింది.
Also Read : Karnataka Car Explosion : ప్రియురాలిపై కత్తితో దాడి.. క్షణాల్లో కారులో పేలుడు.. కర్ణాటకలో సంచలన ఘటన
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా మోత్కుపల్లి గ్రామానికి చెందిన సుష్మితకు, మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ గ్రామానికి చెందిన గాజుల వ్యాపారి జి. అభిలాష్ తో సుమారు 18నెలల క్రితం వివాహమైంది. సుస్మిత ఐదు నెలల గర్భిణి. ఆమె గడిపెద్దాపూర్ లోనే నివాసం ఉంటుంది. గర్భిణిగా ఉన్న సుష్మితను అల్లారుముద్దగా చూసుకోవాల్సిన భర్త.. ఆమె పాలిట యముడిగా మారాడు. సుష్మితపై లేనిపోని అనుమానాలు పెంచుకున్న భర్త.. సుష్మిత కడుపులో పెరుగుతున్న బిడ్డకు డీఎన్ఏ టెస్టు చేయాలంటూ పట్టుబట్టాడు.
గర్భంలోని బిడ్డకు తండ్రి ఎవరో తేలాలంటూ.. డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని సుష్మితపై భర్త అభిలాష్ ఒత్తిడి తెచ్చాడు. భర్తతోపాటు అత్త శశిరేఖల రూపంలో సుష్మిత కొద్దిరోజులు నరకం చూసింది. మృతురాలి తల్లి జానాబాయి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. జూన్ 23న సీమంతం కార్యక్రమం ఏర్పాటులో భాగంగా మాట్లాడేందుకు భర్తతో కలిసి సుష్మిత పుట్టింటికి వెళ్లింది. ఆ సమయంలో అభిలాష్ సీమంతం విషయంపై వాగ్వాదానికి దిగడంతోపాటు.. గర్భంలోని శిశువుకు డీఎన్ఏ పరీక్ష చేయాలంటూ డిమాండ్ చేశాడు. ఈ విషయం రెండు కుటుంబాల సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో జరగడంతో సుష్మిత తీవ్ర మనస్థాపంకు గురైంది. ఆమె వ్యక్తిత్వంపై భర్త అనుమానం వ్యక్తం చేయడంతో తట్టుకోలేకపోయిన సుష్మిత ఆత్మహత్యకు పాల్పడింది.
జూన్ 25వ తేదీన సాయంత్రం సుష్మిత తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గ్రామస్థులు ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. భర్త, అభిలాష్, అత్త లక్ష్మీ నిరంతరం శారీరక, మానసిక వేధింపులకు గురి చేయడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి జానాబాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అల్లాదుర్గం సబ్ఇన్స్పెక్టర్ డి. శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. భర్త అభిలాష్, అతని తల్లి లక్ష్మిని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా, వారిని జ్యుడీషియల్ రిమాండ్కు పంపించారు. సుష్మిత మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం ఆమె తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.
