మద్యం షాపులు తెరవండి సీఎంకు లేఖ

దేశంలో కరోనా విస్తరిస్తుంటే..లిక్కర్ షాపులు తెరవాలని సీఎంకు లేఖ రాశారు. అత్యధికంగా కేసులు నమోదవుతున్నా..ఈ విధంగా లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది.

దేశంలో కరోనా విస్తరిస్తుంటే..లిక్కర్ షాపులు తెరవాలని సీఎంకు లేఖ రాశారు. అత్యధికంగా కేసులు నమోదవుతున్నా..ఈ విధంగా లేఖ రాయడం హాట్ టాపిక్ అయ్యింది. తెలంగాణ లేక ఏపీ సీఎంలకు లేఖ రాశారా ? అని అనుకుంటున్నారా ? కానే కాదు. దేశంలోనే ఎక్కువగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్న మహారాష్ట్ర సీఎంకు రాశారు ఆ లేఖ. రాసింది ఎవరో కాదు..MNS నేత థాకరే. మద్యం దుకాణాలు తెరిస్తే..రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని..వచ్చిన డబ్బును కరోనా నియంత్రణ కోసం వాడొచ్చని చెప్పారంట. ఈ మేరకు 2020, ఏప్రిల్ 23వ తేదీ గురువారం సీఎం ఉద్దవ్ ఠాక్రేకు లేఖ రాయడం సంచలనం సృష్టించింది. గత నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతుందనే విషయాన్ని గుర్తు చేశారాయన. దీనివల్ల రాష్ట్ర ఆర్థికంగా దెబ్బతింటుందనే అభిప్రాయం వెలిబుచ్చారు.

దుకాణాలు తెరవడం మూలంగా రాష్ట్రానికి పన్ను రూపంలో రోజుకు రూ. 41.66 కోట్లు ఆదాయం వస్తుందని..ఎవరికీ ఎలాంటి హానీ జరగదన్నారు. ఆదాయం పెరగడానికి మద్యం దుకాణాలు తెరవడమే ఉత్తమమైన మార్గమన్నారు థాకరే. తక్కువ ధరలకు ఆహారం విక్రయించే వారికి కూడా అనుమతినివ్వాలని, ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది ఆహారం లేక ఇబ్బందు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇలాంటి వ్యక్తుల గురించ ఆలోచించాలని, పార్సిల్స్ సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా..సోషల్ డిస్టెన్స్ పాటించినట్లవుతుందన్నారు.

కరోనా వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందించే వైద్యులకు పీపీఈ కిట్స్ అందించడం ప్రభుత్వానికి కష్టంగా ఉందని, ప్రభుత్వ అధికారులకు జీతాలు చెల్లించడం కష్టతరంగా మారిందని తెలిపారు. కూరగాయలు, పండ్లు వ్యాపారులను అనుమతించాలని, పాల ఉత్పత్తి దుకాణాలను తెరవాలని సూచించారు. మరి ఈయన రాసిన లేఖపై సీఎం ఠాక్రే ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.

దేశంలో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20వేల మార్క్ దాటింది. దీంతో ప్రపంచంలో 20వేల పాజిటివ్ కేసులు దాటిన 17వ దేశంగా భారత్ నిలిచింది. ఐతే ఐసిఎంఆర్ మాత్రం వైరస్ వ్యాప్తిని సమర్ధవంతంగా భారత్ తగ్గించిందని ప్రకటిస్తోంది..కరోనా కేసులు రెట్టింపు అవుతున్న వేగాన్నే ఇందుకు నిదర్శనంగా చూపుతోంది.

కరోనా వైరస్‌ మహమ్మారి మహారాష్ట్రను పట్టిపీడిస్తోంది. రాష్ట్రం మొత్తాన్ని కమ్మేసిన కరోనా…రోజురోజుకు చాపకిందనీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్రలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతునే ఉంది. ఇప్పటికే అక్కడ పాజిటివ్ కేసుల సంఖ్య 5 వేల మార్క్‌ను దాటింది. 2020, ఏప్రిల్ 22వ తేదీ బుధవారం కొత్తగా మరో 431 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 5 వేల 649కి చేరింది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది ప్రాణాలు కోల్పోగా…ఒక్క ముంబైలోనే  10 మంది మృతి చెందారు. ఇక బుధవారం 67 మంది డిశ్చార్జ్ కాగా…దీంతో ఇప్పటిదాకా కోలుకున్న వారి సంఖ్య 789కి చేరింది.

మరోవైపు కరోనా వైరస్ హాట్ స్పాట్‌గా మారిన ముంబై నగరంలో పాజిటివ్‌ కేసుల పెరుగుదలకు ఫుల్‌ స్టాప్‌ పడటం లేదు. 2020, ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఒక్కరోజులోనే ముంబైలో 10 మంది మరణించారు. దీంతో దేశ ఆర్థిక రాజధానిలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 3000లను దాటింది. మరోవైపు మృతుల సంఖ్య 150ని దాటేసింది. అటు ఆసియాలోకెల్లా అతిపెద్ద మురికివాడగా పేరొందిన ధారావిలో కరోనా విలయతాండవం చేస్తోంది. ధారావిలో కరోనా కేసుల సంఖ్య 200లకు చేరువైంది. మరణాల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతూ వస్తుంది.