ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా? తక్కువ ధరకే అమ్మకానికి రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు
www.swagruha.telangana.gov.inలో పూర్తి వివరాలు చూసుకోవచ్చు.

Rajiv Swagruha
తక్కువ ధరకు ఫ్లాట్ లభ్యమైతే కొనాలని ఎదురుచూస్తున్న పేద, మధ్య తరగతి వారికి గుడ్‌న్యూస్. పోచారంలోని సద్భావన టౌన్షిప్లో మిగిలిన ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. వీటిలో 255 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు (ఒక్కోటి రూ.13 లక్షలకు), 340 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు (ఒక్కోటి రూ.25 లక్షలు) అందుబాటులో ఉన్నాయి.
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తాజాగా పోచారం టౌన్‌షిప్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్లు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ విశాలమైన రోడ్లతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయన్నారు.
Also Read: హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
ఈ టౌన్షిప్లో వెయ్యికి పైగా కుటుంబాలు ఉంటున్నాయి. ఇప్పుడు విక్రయానికి ఉంచిన ఫ్లాట్లు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తైతే ఈ టౌన్‌షిప్‌కు కేవలం 10 నిమిషాల్లో ప్రయాణించవచ్చని తెలిపారు.
పోచారంలో ఇన్ఫోసిస్‌తో పాటు రహేజా ఐటీ పార్క్, ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోనే ఈ ఫ్లాట్లు ఉన్నాయని చెప్పారు. బహిరంగ మార్కెట్లో ఇటువంటి ఫ్లాట్ల రేట్లు రూ.50 లక్షలకు తక్కువగా లేవని తెలిపారు.
ఫ్లాట్లు కొనడానికి ఆసక్తి చూపుతున్న వారి నుంచి అప్లికేషన్ టోకెన్ అడ్వాన్స్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఫ్లాట్లను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. మరోవైపు, నాగోల్ సమీపంలోని బండ్లగూడ సహభావన టౌన్షిప్ కూడా ఫ్లాట్లను విక్రయానికి ఉంచారు. www.swagruha.telangana.gov.inలో పూర్తి వివరాలు చూసుకోవచ్చు.