Ramanthapur incident
Ramanthapur incident: ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్ (Ramanthapur incident) గోకులేనగర్ లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపులో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగిలి ఆరుగురు మృతిచెందారు. మృతుల కుటుంబాలను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించారు. వారికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు.
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. మరో 100 మీటర్ల దూరంలో శోభాయాత్ర ముగుస్తుందనగా ఘటన జరగడం దురదృష్టకరం. కేబుల్ వైర్ ద్వారా కరెంట్ సరఫరా జరిగి ప్రమాదం సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశాం. దర్యాప్తు నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేబుల్ వైర్లు, కరెంటు తీగలపై స్పెషల్ డ్రైవ్ కు ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు.
రామంతాపూర్‌లో కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి ఊరేగింపు చేపట్టారు. అయితే, రథాన్ని లాగుతున్న వాహనం మరమ్మతులకు గురికావడంతో దాన్ని పక్కనే నిలిపివేసి.. ఊరేగింపులో పాల్గొన్న కొందరు రథాన్ని చేతులతో ముందుకు లాగుతూ తీసుకెళ్లారు.
కొద్దిదూరం వెళ్లగానే.. రథానికి విద్యుత్ తీగలు తాకడంతో రథాన్ని లాగుతున్న వారు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ ఘటనలో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.