Revanth Government: రేవంత్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ కోసం రూ.375 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రజల ఆశల ప్రాజెక్ట్‌గా దీన్ని సర్కార్ భావిస్తోంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్ నగరానికి కొత్త అందం వస్తుంది. మూసీకి ఆధునిక వసతులు లభించనున్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా గ్రీనరీ ప్రదేశాలు పెరగనున్నాయి.
భావి తరాల కోసం ‘మూసీ’ ప్రక్షాళన చేసి తీరతాం అని మంత్రి శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు. నీటి వనరుల పరిరక్షణలో తెలంగాణ రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. ఆర్థిక భవిష్యత్తుకు పట్టణ ప్రణాళికే పునాది అని చెప్పారు.
ఐటీపీఐ సౌత్ జోన్ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) కోసం 2వ క్వార్టర్ లో 375 కోట్లు మంజూరు చేసింది.
ఈ కేటాయింపు 2025-26 సంవత్సరానికి రూ.1500 కోట్ల బడ్జెట్ కేటాయింపులో భాగం. ఈ నిధులను మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్లాన్ పథకం కింద ఉపయోగిస్తారు.
ఈ మొత్తాన్ని ప్రాజెక్ట్ అమలు కోసం MRDCL PD ఖాతాకు జమ చేస్తారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా హైదరాబాద్‌లోని మూసీ నది సుందరీకరణ, కాలుష్య నియంత్రణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
ముఖ్యమైన పనులలో పార్కులు, నడక మార్గాలు, సైక్లింగ్ ట్రాక్‌లు, మురుగునీటి శుద్ధి కర్మాగారాలు, వరదలను నివారించడానికి కట్టల నిర్మాణం, నదీ తీరం వెంబడి సాంస్కృతిక, వినోద ప్రదేశాల ఏర్పాటు ఉన్నాయి.
వివిధ వర్గాలు ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లనుందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు.
“ఒక మంచి కార్యక్రమం చేపట్టినప్పుడల్లా, దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించే శక్తులు ఎల్లప్పుడూ ఉంటాయి. మూసీ ప్రాజెక్టుకు కూడా ఇది వర్తిస్తుంది.
భవిష్యత్ తరాల అవసరాలను పరిగణనలోకి తీసుకుని, మేము ఈ లక్ష్యాన్ని పూర్తి చేస్తాం.
జల వనరుల సంరక్షణలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది” అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పట్టణ ప్రణాళిక ఆర్థిక శ్రేయస్సుకు పునాది అని, నిజమైన అభివృద్ధి పర్యావరణ స్థిరత్వంతో కలిసి సాగాలని ఆయన నొక్కి చెప్పారు.
“భవనాలను నిర్మించడం వల్ల మాత్రమే వృద్ధి సాధ్యం కాదు. మనం రూపొందించే ప్రతి విధానం, మనం రక్షించే ప్రతి అడవి, మనం పునరుద్ధరించే ప్రతి నది, మనం సృష్టించే ప్రతి జీవనోపాధి తరతరాలుగా జరిగే న్యాయం” అని శ్రీధర్ బాబు అన్నారు.
పట్టణ పచ్చదనం విస్తరణ, కార్బన్-న్యూట్రల్ వృద్ధి, నీటి సంరక్షణ, స్థిరమైన రవాణాలో తెలంగాణ ఇప్పటికే జాతీయ ప్రమాణాలను నిర్దేశించిందని మంత్రి పేర్కొన్నారు.
వాతావరణ మార్పు, పట్టణ వరదలు, కాలుష్యం, భూగర్భజల క్షీణత, తగ్గిపోతున్న పచ్చదనం, వేగవంతమైన పట్టణీకరణ వంటి వాటిని పరిష్కరించే సమగ్ర ప్రణాళికకు పిలుపునిస్తూ, వాతావరణ-స్థిరమైన నగరాల రూపకల్పనలో సాంకేతికత పాత్రను మంత్రి శ్రీధర్ బాబు నొక్కి చెప్పారు.
Also Read: వాడొచ్చింది బ్యాటు కోసం కాదు..! అందరి ముందు ఎన్‌కౌంటర్ చేయాలి.. సహస్ర తండ్రి సంచలన డిమాండ్..