తీహార్ జైల్లో కవితను పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్
ఈ ఒక్క లొసుగును ఆధారంగా చేసుకుని ఈడీ వేధింపులకు పాల్పడుతోంది. ఈ కేసులో మనీలాండరింగ్ ఎక్కడ జరిగింది? ఎక్కడైనా నగదు స్వాధీనం చేసుకున్నారా?

RS Praveen Kumar Balka Suman
RS Praveen Kumar, Balka Sumanబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రాజకీయ కక్షతో బీజేపీ జైల్లో పెట్టిందని ఆ పార్టీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ ఆరోపించారు. ఢిల్లీ తీహార్ జైలో ఉన్న ఎమ్మెల్సీ కవితను శుక్రవారం వీరు పరామర్శించారు. అనంతరం తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టి బీజేపీ సర్కారు వేధిస్తోందని విమర్శించారు. దేశంలో వేధింపుల పాలన సాగుతోందని దుయ్యబట్టారు. కేసులకు భయపడబోమని చెప్పారు.
ముమ్మాటికీ కక్ష సాధింపే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
”కవితపై పెట్టిన కేసు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో పెట్టినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మొదట సాక్షి అన్నారు, తర్వాత అనుమానితురాలు అన్నారు.. అనంతరం నేరుగా అరెస్టు చేశారు. ఈడీ కేసులో జ్యూడిషల్ రిమాండ్ లో ఉండగా సీబీఐ కేసులో అరెస్టు చేయడం కక్ష సాధింపు కాక మరేంటి? మనీలాండరింగ్ కేసులో తనపై మోపిన అభియోగం నిజం కాదని నిరూపించుకునే బాధ్యత నిందితులపైనే ఉంటుంది. ఈ ఒక్క లొసుగును ఆధారంగా చేసుకుని ఈడీ వేధింపులకు పాల్పడుతోంది. ఈ కేసులో మనీలాండరింగ్ ఎక్కడ జరిగింది? ఎక్కడైనా నగదు స్వాధీనం చేసుకున్నారా? అలాంటప్పుడు మనీలాండరింగ్ చట్టాన్ని ఎలా ప్రయోగిస్తారు?
ఈ మొత్తం వ్యవహారంలో లంచం డిమాండ్ చేసినట్టు ఎక్కడా లేదు. అలాంటప్పుడు అవినీతి నిరోధక చట్టం ఎలా ప్రయోగిస్తారు? కేవలం అప్రూవర్లు ఇచ్చిన వాంగ్మూలాలు ఆధారంగా కవితను జైల్లో పెట్టారు. జైల్లో ఉన్న కవితపై దర్యాప్తు సంస్థలు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయి. వారి పేరు చెప్పండి, వీరి పేరు చెప్పండి అంటూ వేధింపులకు పాల్పడుతున్నాయి. బీజేపీతో చేతులు కలిపిన నేతలపై ఉన్న కేసులను మూసేస్తున్నారు. దీనిపై ఏ మీడియా సంస్థ ప్రశ్నించే పరిస్థితి లేదు. కోర్టులను కూడా బీజేపీ భయపెడుతోంద”ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
Also Read: నిజామాబాద్‌లో పోటీ అంటే పద్మవ్యూహంలో చిక్కుకోవడమే.. రిజల్ట్‌పై జీవన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
బీజేపీ రచించిన బూటకపు కేసు: బాల్క సుమన్
”ప్రభుత్వాలు రూపొందించిన పాలసీలపై కేసులు పెడితే, బీజేపీ తీసుకొచ్చిన అనేక పాలసీలు రేపు కుంభకోణాలుగా మారతాయి. ఢిల్లీ మద్యం పాలసీ కారణంగా ఏ ఒక్కరికి నష్టం జరగలేదు. ఇది పూర్తిగా బీజేపీ రచించిన బూటకపు కేసు.. ఆ పార్టీ నేత పర్వేష్ వర్మ చెప్పినట్టే దర్యాప్తు సంస్థలు వ్యవహరించాయి. దేశంలో పేరుకే డెమోక్రసీ. పూర్తిగా ఆటోక్రసి నడుస్తోంది. ఇలాంటి కేసులకు అదిరేది లేదు, బెదిరేది లేదు. కవిత జైల్లో ఉన్న చాలా ధైర్యంగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 220 సీట్లకు మించి రావు. ఇప్పటివరకు జరిగిన నాలుగు దశల పోలింగ్లో బీజేపీ వెనుకబడిందని చాలామంది చెబుతున్నారు. స్టాక్ మార్కెట్లు కూడా పతనమవుతున్నాయి. ఇది కూడా ఒక సంకేతమ”ని బాల్క సుమన్ అన్నారు.
Also Read: జూన్ 4 తర్వాత.. తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు..!