తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. మరో 6 పాజిటివ్ కేసులు నమోదవగా… ఒకరు మృతి చెందారు.
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా.. సోమవారం (మార్చి 30, 2020) మరో 6 పాజిటివ్ కేసులు నమోదవగా… ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 77కు చేరగా… మృతుల సంఖ్య రెండుకి పెరిగింది. ఇవాళ కొత్తగా నమోదైన 6 కేసుల్లో ఇద్దరు కరీంనగర్ వాసులున్నారు.
అయితే… కరోనా బారినపడి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 13మంది కోలుకోవడంతో వారిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. వీరిలో 9మంది ఇండోనేషియా వాసులుండగా… నలుగురు హైదరాబాద్ కు చెందిన వారున్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 14కి పెరిగింది. మొత్తంగా ప్రస్తుతం తెలంగాణలో 61 యాక్టివ్ కేసులుండగా… ఇద్దరు మృతి చెందారు. 14మంది డిశ్చార్జ్ అయ్యారు.
కరోనా పంజా విసురుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు షాక్ ఇచ్చారు. జూనియర్ డాక్టర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. మార్చి 31 నుంచి విధులకు దూరంగా(silent boycott) ఉంటామని చెప్పారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి(డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) జూనియర్ డాక్టర్ల అసోషియేషన్ ఓ నోటీసు పంపింది. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ భయపెడుతోంది. తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
అయితే వైద్య సేవలు అందించే తమకు సరైన సౌకర్యాలు లేవని జూనియర్ డాక్టర్లు వాపోతున్నారు. కరోనా సోకకుండా సరిపడా మాస్కులు, పరకరాలు, గ్లోవ్స్, కోట్లు, ట్రాన్స్ పోర్టేషన్, వసతి సదుపాయం ప్రభుత్వం తమకు ఇవ్వలేదన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము రిస్క్ తీసుకోలేమని చెప్పారు. దీని గురించి ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయిందన్నారు. సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయన్నారు.
ఈ క్రమంలోనే మరో దారి లేని పరిస్థితుల్లో, విధులకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు జూడాలు తెలిపారు. వైద్య సేవలు అందించే క్రమంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే తమకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉందని జూనియర్ డాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. చూస్తూ చూస్తూ తమ జీవితాలను ప్రమాదంలో పడేసుకోలేము అన్నారు.