Drinking Water Crisis ఎండుతున్న గొంతులు.. బిందెడు నీళ్లకోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భూగర్భ జల మట్టాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. విచ్చలవిడిగా బోరు బావుల తవ్వకాలు, వేడి తీవ్రత నిరంతరంగా కొనసాగుతుండటంతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్ కారణంగా బోర్ల వినియోగం పెరిగిపోతోంది.

Water Crisis
drinking water crisis : మండుతున్న ఎండలతో ఆదివాసీ గుడాల్లో తాగునీటి కష్టాలు తీవ్రమయ్యాయి. వేసవికాలం ప్రారంభంలోనే గొంతు తడిసే పరిస్థితి లేక అనేక గ్రామాలు, తండాలు దాహం కేకలు పెడుతున్నాయి. జలాశయాల్లో నీటిమట్టాలు పడిపోతున్నాయి. బోర్లు, బావులు ఎండిపోతున్నాయి. చాలాచోట్ల ట్యాంకర్లు, చలమనీరే దిక్కవుతోంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చుక్కనీరు దొరక్క గిరిజనులు తిప్పలు పడుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భూగర్భ జల మట్టాలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. విచ్చలవిడిగా బోరు బావుల తవ్వకాలు, వేడి తీవ్రత నిరంతరంగా కొనసాగుతుండటంతో పాటు 24 గంటల ఉచిత విద్యుత్ కారణంగా బోర్ల వినియోగం పెరిగిపోతోంది. దీంతో భూగర్భ జలాలు వేగంగా అడుగంటిపోతున్నాయి. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భూగర్భ జలాల మట్టం పడిపోవడం ప్రమాద సంకేతాన్ని అందిస్తోంది. మరో నెల రోజుల్లోనే నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందన్న సంకేతాలిస్తున్నారు భూగర్భ జలశాఖ అధికారులు.
Karnataka : కన్నడ భగీరథుడు-ఒక్కడే 32 అడుగుల బావి తవ్వేశాడు
ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాజెక్టులు.. చెరువులు.. కుంటల్లోనూ నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. జైనూర్, ఉట్నూర్, ఇంద్రవెల్లి, లింగపూర్, బెల, సిర్పూర్ యు, వాంకిడి, భీమిని, లోమి లాంటి ఆదివాసీ గ్రామాలు, తండాల్లో నీటి కష్టాలు తీవ్రంగా ఉన్నాయి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు మిషన్ భగీరధ నీళ్లు రావడంలేదని చెబుతున్నారు.
అధికారులకు ఫోన్‌లు చేస్తే కనీసం లిఫ్ట్ చేయడం లేదని.. కంట్రోల్ రూంకు వెళ్దామన్నా కిలోమీటర్ల దూరం ఉంటోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమకు మంచినీటి సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నీటి కొరత తీవ్రం కానుందన్న సంకేతాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నప్పటికీ .. సంబంధిత అధికారులు మాత్రం ప్రత్యామ్నాయ చర్యల విషయంలో .. ఇప్పటి వరకు ముందస్తు ప్రణాళికలు రూపొందించక పోవడంతో.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భూగర్భ జల శాఖ నివేధికల ప్రకారం.. సంబంధిత అధికారులు ఏజెన్సీ ప్రాంతంలోనే కాకుండా.. గుట్ట మీద పల్లెలు.. మైదాన ప్రాంతాల్లోనూ.. ప్రత్యామ్నాయ చర్యలను ఇప్పటి నుంచే చేపట్టాలని కోరుతున్నారు. అటు మిషన్ భగీరథ పథకం ద్వారా ఈ ఏడాది ఇంటింటికీ తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ .. రావడంలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.