రూ.45లక్షలు సిద్ధం చేసి వీడియో కాల్‌లో చూపించండి, దీక్షిత్ తల్లికి మరోసారి కిడ్నాపర్ ఫోన్

deekshith kidnapper: మహబూబాబాద్ లో తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్ కిడ్నాప్ కేసులో మిస్టరీ కొనసాగుతోంది. బాబు ఇంకా కిడ్నాపర్ల చెరలోనే ఉన్నాడు. కాగా, దీక్షిత్ తల్లికి మరోసారి కిడ్నాపర్ ఫోన్ చేశాడు. బుధవారం(అక్టోబర్ 21,2020) ఉదయం 10 గంటల 40 నిమిషాలకు కిడ్నాపర్ ఫోన్ చేశాడు. రూ.45లక్షలు సిద్ధం చేసి వీడియోకాల్ ద్వారా చూపించాలని కిడ్నాపర్ చెప్పాడు. డబ్బులు ఎక్కడికి తేవాలో మరోసారి ఫోన్ చేస్తానని కిడ్నాపర్ తెలిపాడు.
మూడు రోజులుగా కిడ్నాపర్ల చెరలోనే:
దీక్షిత్ కిడ్నాప్‌పై మిస్టరీ కొనసాగుతోంది. మూడు రోజులుగా కిడ్నాపర్ల చెరలోనే దీక్షిత్ ఉన్నాడు. నిన్న(అక్టోబర్ 20,2020) రాత్రి 8:30 గంటల సమయంలో బాలుడి తల్లికి మరోసారి ఫోన్ చేసిన కిడ్నాపర్లు..రూ.45 లక్షలు రెడీ చేసుకోవాలని ఎక్కడికి తీసుకురావాలో బుధవారం చెబుతామని అన్నారు. అయితే అంత డబ్బు తమ దగ్గర లేదని కొంత మొత్తం సర్దుబాటు చేస్తామని, బాలుడికి ఎలాంటి హాని తలపెట్టొద్దని దీక్షిత్ తల్లి కిడ్నాపర్ ని వేడుకుంది. అయినా కనికరించని కిడ్నాపర్లు తాము అడిగిన మొత్తం ఇవ్వాల్సిందే అని చెప్పి, ఫోన్ కట్ చేశారు.
రంగంలోకి ఐటీ కోర్, టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్:
దీక్షిత్ కిడ్నాప్ వ్యవహారం పోలీసులకే సవాల్‌గా మారింది. బాలుడి తండ్రి జర్నలిస్ట్ కావడంతో జర్నలిస్ట్ సంఘాలు డీజీపీ దృష్టికి తీసుకెళ్లగా…పరిస్థితిపై ఆరా తీశారు. అటు స్థానిక బీజేపీ నాయకులు కిడ్నాప్ విషయాన్ని కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించినా కేసులో ఏమాత్రం పురోగతి కనిపించకపోవడంతో ఐటీ కోర్, టాస్క్ ఫోర్స్, ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. బాలుడి ఆరోగ్యపరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
https://10tv.in/police-chase-baby-kidnap-case-in-mgbs/
టెక్నాలజీ ద్వారా పోలీసులకు సవాల్:
కిడ్నాపర్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. పోలీసులకు ఆచూకీ తెలియకుండా ఉండేందుకు టెక్నాలజీని వాడుకుంటున్నారు. ఇంటర్నెట్ కాల్స్ ద్వారా బాలుడి తల్లికి ఫోన్ చేస్తున్నాడు. ఇంటర్నెట్ కాల్స్ కారణంగా పోలీసులు కిడ్నాపర్ ఆచూకీని కనుక్కోలేకపోతున్నారు. బాలుడి క్షేమంపై అంతా ఆందోళనగా ఉన్నారు. బాబు క్షేమంగా తల్లి ఒడికి చేరాలని ప్రార్థనలు చేస్తున్నారు.