మానవత్వం మరిచిన కొడుకు.. 15ఎకరాలు, 60లక్షల క్యాష్.. అయినా తండ్రికి తలకొరివి పెట్టేందుకు ససేమీరా.. కూతురు ముందుకొచ్చి..

ఆస్తికోసం ఓ కొడుకు మానవత్వం మర్చాడు. కనిపెంచి, ఒక స్థాయికి తీసుకొచ్చిన తండ్రి అనారోగ్యంతో చనిపోతే కడసారి చూపు చూడడానికి .

మానవత్వం మరిచిన కొడుకు.. 15ఎకరాలు, 60లక్షల క్యాష్.. అయినా తండ్రికి తలకొరివి పెట్టేందుకు ససేమీరా.. కూతురు ముందుకొచ్చి..

Mahabubnagar District

Updated On : April 17, 2025 / 10:04 AM IST

Mahabubnagar District: ఆస్తికోసం ఓ కొడుకు మానవత్వం మర్చాడు. కనిపెంచి, ఒక స్థాయికి తీసుకొచ్చిన తండ్రి అనారోగ్యంతో చనిపోతే కడసారి చూపు చూడడానికి కూడా రాలేదు.. కోట్ల విలువైన ఆస్తులను అప్పగించినా.. చెల్లెకు ఇల్లు రాసిచ్చాడని తండ్రిపై కోపం పెంచుకున్నాడు. తలకొరివి పెట్టేందుకు ససేమీరా అన్నాడు. ఇంటిని నీకే తిరిగిస్తామని ఇద్దరు చెల్లెళ్లు.. బంధువులు బతిమిలాడినా తలకొరివి పెట్టేందుకు ఒప్పుకోలేదు.. దీంతో చిన్న కూతురే తండ్రి చితికి నిప్పు పెట్టింది.. ఈ అమానుష ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

 

నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్ పల్లి గ్రామానికి చెందిన మాణిక్యరావు (80), సురేఖ భార్యాభర్తలు. వీరికి గిరీశ్, కవిత, రఘునందిని సంతానం. మాణిక్యరావు సర్వే అండ్ ల్యాండ్స్ రికార్డ్స్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రలోనే 25ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. కొడుకు, కూతుళ్లకు పెళ్లిళ్లు చేశాడు. నాలుగేళ్ల కిందటే అతని భార్య సురేఖ చనిపోయింది.

 

మాణిక్యరావు తనకు సొంతూరులో ఉన్న 15ఎకరాల భూమితోపాటు రూ.60లక్షల క్యాష్ ను కొడుకు గిరీశ్ కు ఇచ్చాడు. అయితే, మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో సొంత ఇల్లును మాత్రం చిన్న కూతురు రఘునందినికి ఇచ్చాడు. వారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఇంటిని చిన్నకూతురు పేరుపై రాశాడు. ఇది కొడుకు గిరీశ్ కు నచ్చలేదు. అతను హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. కూతురి పేరుపై ఇంటిని రాసివ్వడంతో తండ్రిపై కోపం పెంచుకున్నాడు. తండ్రి అనారోగ్యంతో మృతిచెందగా.. చెల్లెళ్లు సమాచారం ఇచ్చారు. తండ్రికి తలకొరివి పెట్టేందుకు రావాలని వేడుకున్నాడు. కానీ, కొడుకు గిరీశ్ ససేమీరా అన్నాడు.

 

తండ్రి నాకిచ్చిన ఇంటిని నీకే ఇస్తాను.. తలకొరివి పెట్టేందుకు రావాలని చెల్లెలు వేడుకుంది. అయినా ఆయన మనసుకరగలేదు. దీంతో మాణిక్యరావు స్నేహితులు అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకొచ్చారు. అన్నను ఎంత బతిమిలాడినా రాకపోవటంతో చిన్న కూతురు రఘునందిని తండ్రికి తలకొరివి పెట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పదిహేను ఎకరాల పొలం, 60లక్షల క్యాష్ వారసత్వంగా ఇచ్చినప్పటికీ తండ్రికి తలకొరివి పెట్టేందుకురాని కొడుకు తీరుపై కొందరు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.