MLAs DIsqualification Issue
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలలో ఐదుగురి భవితవ్యంపై తేలింది. వారి అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు (భద్రాచలం), బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల) , గూడెం మహిపాల్‌రెడ్డి(పటాన్ చెరు) , ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్) , అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి) పై తీర్పు వెలువరించారు. వారిపై దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు. ఈ మేరకు తీర్పు వెలువరించారు. ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు నిరూపించదగిన ఎలాంటి ఆధారలు లేవంటూ స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు వారు పార్టీ మారినట్టు ఆధారలు లేవని స్పష్టం చేశారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సందర్భాలను పార్టీ మారినట్టుగా పరిగణించలేమని స్పీకర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వారిపై అనర్హత వేటు వేసేందుు నిరాకరించారు. వారిపై అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఇక మిగిలిన వారిలో ముగ్గురి భవితవ్యం రేపు తేలనుంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఈ ఎమ్మెల్యేలు ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది.
ఎల్లుండితో గడువు ముగింపు.. ఇవాళే తీర్పు
కాగా, పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టులో పలుసార్లు విచారణ జరిగింది. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై 3 నెలల్లోపు నిర్ణయం వెలువరించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది.
అయితే, స్పీకర్ ఆ సమయంలోపు నిర్ణయం తీసుకోకపోవడంతో ఇది కోర్టు ధిక్కారం కిందకు తీసుకోవాల్సి వస్తుందని సుప్రీంకోర్టు నవంబరు 17న పేర్కొంది. వచ్చే విచారణ తేదీలోపు ఆ పిటిషన్లపై చర్యలు తీసుకోవాలని లేదంటే కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు. అనర్హత పిటిషన్లపై ఎల్లుండితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఇవాళ తీర్పు వెలువరించారు.