తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా 

  • Published By: bheemraj ,Published On : June 6, 2020 / 07:51 PM IST
తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా 

Updated On : June 6, 2020 / 7:51 PM IST

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. టెన్త్ ఎగ్జామ్స్  వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. హైకోర్టు తీర్పుపై చర్చించిన ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రమంతటా ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు  ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

రాష్ట్రంలో టెన్త్ పరీక్షల నిర్వహణపై హైకోర్టులో విచారణ జరిగింది. శనివారం (జూన్ 6, 2020) హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో టెన్త్ పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జీహెచ్ఎంసీ, రంగారెడ్డి మినహా ఇతర జిల్లాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు పర్మిషన్ ఇచ్చింది.

కాగా, జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతించాలని, సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యులర్ గా గుర్తించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కరోనా కేసులున్నప్పటికీ పరీక్షలు నిర్వహించేందుకుగానూ జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో జాగ్రత్తలు తీసుకున్నామని.. పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని ప్రభుత్వం కోర్టును కోరింది. 

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనాతో ఎవరైనా విద్యార్థి మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? పరీక్షా కేంద్రాలున్న ప్రాంతాలు కంటైన్ మెంట్ జోన్లుగా మారితే ఏం చేస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రత దృష్ట్యా విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేమని.. పరీక్షల కన్నా విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జీహెచ్ ఎంసీ, రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో పరీక్షల నిర్వహణకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

పదో తరగతి పరీక్షలపై విచారించిన హైకోర్టు పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే రాష్ట్రంలో వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం కష్టమని, ప్రశ్నా పత్రాలు మళ్లీ మళ్లీ తయారు చేయడం ఇబ్బందని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ కోర్టుకు తెలిపారు. విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా లేక సాంకేతిక అంశాలు ముఖ్యమా… అని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.