Narsampet Students Gang War : వామ్మో.. వీళ్లు విద్యార్థులా? వీధి రౌడీలా? అమ్మాయి కోసం ఎంత ఘోరంగా కొట్టుకున్నారో..

ఒక అమ్మాయి కోసం విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి.. కర్రలు, రాడ్లతో దారుణంగా కొట్టుకున్న ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్ లో చోటు చేసుకుంది.

Narsampet Students Gang War : వామ్మో.. వీళ్లు విద్యార్థులా? వీధి రౌడీలా? అమ్మాయి కోసం ఎంత ఘోరంగా కొట్టుకున్నారో..

Narsampet Students Gang War : చక్కగా కాలేజీకి వెళ్తూ బుద్దిగా చదువుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాల్సిన విద్యార్థులు దారి తప్పుతున్నారు. పెడదోవ పడుతున్నారు. అమ్మాయి కోసం, ప్రేమ కోసం అంటూ రోడ్డున పడి కొట్టుకుంటున్నారు. తల్లిదండ్రుల పరువు తీస్తున్నారు. వారి ఆశలను వమ్ము చేస్తున్నారు. చేతులారా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా.. బస్టాండ్ లో అందరి ముందు విద్యార్థులు గొడవ పడిన ఘటన చుట్టూ ఉన్నవారిని షాక్ కి గురి చేసింది. ఒక అమ్మాయి కోసం విద్యార్థులు రెండు గ్రూప్ లుగా విడిపోయి.. కర్రలు, రాడ్లతో దారుణంగా కొట్టుకున్న ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్ లో చోటు చేసుకుంది.

బస్టాండ్‌లో ఒక్కసారిగా గ్రూప్ వార్ మొదలైంది. ఇద్దరు విద్యార్థులకు చెందిన రెండు గ్యాంగుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణగా మారింది. సినిమా స్టైల్‌లో ఫైట్ జరిగింది. కర్రలతో కొట్టుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. బస్టాండ్ లో వాతావరణం భీకరంగా మారిపోయింది. రెండు వర్గాల్లోని విద్యార్థులు ఆవేశంతో ఊగిపోతూ.. ఒకరివెనక ఇంకొకరు పరుగులు తీస్తూ.. దాడులు చేసుకుంటుంటే.. అక్కడున్న ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక కంగారుపడ్డారు. భయంతో పరుగులు తీశారు.

నర్సంపేటలోని వొకేషనల్ కాలేజీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఒకే అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి కోసం ఇలా రోడ్డెక్కారు. బస్టాండ్ లో జనం ఉన్నారన్న విషయాన్ని కూడా మరిచిపోయి ముష్టి యుద్ధానికి దిగారు.

సినిమా స్టైల్‌లో సాగిన ఈ ఫైట్ అంతా.. ఒక అమ్మాయి కోసం జరిగింది. అమ్మాయి నాది అంటే నాది అంటూ.. ఇద్దరి మధ్య మొదలైన ఈ వివాదం.. రెండు గ్యాంగుల మధ్య ఘర్షణగా మారింది. నర్సంపేట బస్టాండ్‌ లో జరిగిన ఈ ఫైట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

బస్టాండ్ లో ఉన్న ప్రయాణికులు, స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటిసారి వీరిద్దరు దాడులకు పాల్పడినప్పుడే పోలీసులు చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ దారుణం జరిగేది కాదంటున్నారు. ఒక అమ్మాయి కోసం విద్యార్థులు ఇలా బజారున పడి కొట్టుకోవడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వీళ్లసలు విద్యార్థులా? వీధి రౌడీలా? అని తిట్టిపోస్తున్నారు.

కాగా.. ఈ గొడవ ఈ నెల 19న జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘర్షణకు సంబంధించిన విద్యార్థులను గుర్తించి.. అదే రోజు చర్యలు తీసుకున్నామన్నారు. పాత వీడియోలను కావాలనే సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ.. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని పోలీసులు మండిపడ్డారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.