నీట్ పరీక్షపై వివాదం.. విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లిన హైదరాబాద్

వివాదాస్పదంగా మారిన నీట్ యూజీ 2024 పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్‌తో విద్యార్థి సంఘాలు మంగళవారం నిర్వహించిన ధర్నాలతో హైదరాబాద్ దద్దరిల్లింది.

నీట్ పరీక్షపై వివాదం.. విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లిన హైదరాబాద్

Students hold protests in Hyderabad over NEET UG 2024 row

Students Protest NEET UG 2024 row: నీట్ పరీక్షను రద్దు చేయాలన్న డిమాండ్‌తో విద్యార్థి సంఘాలు మంగళవారం నిర్వహించిన ధర్నాలతో హైదరాబాద్ దద్దరిల్లింది. హిమాయత్ నగర్ వై జంక్షన్ నుండి లిబర్టీ వరకు స్టూడెంట్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్‌యూఐ, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూ, విద్యార్థి జన సమితి, ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం, ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ, పీవైఎల్ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని విద్యార్థులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీతో సంబంధం ఉన్న దోషులను శిక్షించాలని, లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్టీఏను రద్దు చేయాలన్నారు. నీట్ పరీక్షను తాజాగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా విద్యార్థులతో పాటు ర్యాలీలో పాల్గొన్నారు.

రాజ్‌భ‌వ‌న్‌ ముట్టడికి బీఆర్ఎస్వీ యత్నం
నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాజ్‌భ‌వ‌న్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

నీట్ అక్రమాల్లో సీఎం రేవంత్ హస్తం: గెల్లు శ్రీనివాస్‌
నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని.. ఈ వివాదంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పందించక పోతే రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని గెల్లు శ్రీనివాస్‌ అన్నారు. నీట్ పరీక్ష అక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తం ఉందని భావిస్తున్నామని, ముఖ్యమంత్రి స్పందించకపోతే ఆయన కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు.